పసికందు గడ్డలో మరో బిడ్డ

8 Apr, 2016 06:59 IST|Sakshi
శిశువుకు శస్త్రచికిత్స చేసిన వైద్యబృందం, (ఇన్‌సెట్లో) గడ్డతో ఉన్న చిన్నారి

* గడ్డలో తల తప్ప మిగిలిన అవయవాలు
* అసంపూర్తిగా ఏర్పడిన రెండో శిశువు
* గుంటూరు జీజీహెచ్‌లో శస్త్రచికిత్స

గుంటూరు మెడికల్: మలవిసర్జన మార్గం వద్ద గడ్డ ఉన్న పసికందుకు ఆపరేషన్ చేయగా అందులో మరో బిడ్డ కనిపించడంతో వైద్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. తల మినహా మిగతా శరీర అవయవాలన్నీ గడ్డలో కనిపించాయి. తల్లి గర్భంలో కవలలు రూపుదిద్దుకునే సమయంలో అసౌకర్యం వల్ల రెండో శిశువు ఏర్పడకుండా అసంపూర్తిగా నిలిచిపోయినట్లు వైద్యులు గుర్తించారు.

పసికందు మలవిసర్జన మార్గం వద్దనున్న గడ్డను తొలగించారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన రాధా, నాగులు దంపతులకు తొలి సంతానంగా మార్చి 30న మగశిశువు జన్మించాడు. పుట్టిన శిశువు మలవిసర్జన మార్గం వద్ద దాదాపు 1.2 కిలోల బరువు గడ్డ (ట్యూమర్) ఉంది. దీంతో బిడ్డను గుంటూరు జీజీహెచ్‌కు అదేరోజు తీసుకొచ్చారు. జీజీహెచ్ వైద్యులు సాధారణ గడ్డగా భావించి ఈ నెల 2వ తేదీన శస్త్రచికిత్స చేశారు. గడ్డకు మత్తు ఇచ్చి తొలగించే ప్రయత్నం చేయగా లోపల పూర్తిగా ఏర్పడని చెయ్యి కనిపించింది.

దాంతోపాటు కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండె, పేగులు, ఇతర శరీర అవయవాలన్నీ గడ్డలో ఉన్నాయి. తల తప్ప ఇతర అవయవాలన్నీ గడ్డలో ఉండడంతో వైద్యులు ‘ఇన్‌కంప్లీట్ కన్‌జాయింటనల్’గా నిర్ధారించారు. తల్లి గర్భంలో కవలలు ఏర్పడే సమయంలో అసౌకర్యం కలగడంతో ఒక శిశువు మాత్రమే పూర్తిగా రూపుదిద్దుకుని రెండో శిశువు అసంపూర్తిగా ఏర్పడినట్లు పిల్లల శస్త్రచికిత్స విభాగాధిపతి డాక్టర్ చందా భాస్కరరావు గురువారం చెప్పారు. సుమారు 3 గంటలపాటు శస్త్రచికిత్స చేసి గడ్డను తొలగించి పసికందు ప్రాణాలను నిలిపామని పేర్కొన్నారు. ఈ శస్త్ర చికిత్సలో డాక్టర్ చందా భాస్కరరావుతోపాటు డాక్టర్లు జయపాల్, కె.నరసింహారావు, జాకీర్  పాల్గొన్నారు.
 
ఆహార నాళం ఏర్పడని శిశువు ప్రాణాలు కాపాడారు
కేవలం కిలోన్నర బరువు ఉండి, ఊపిరితిత్తుల సమస్యతో ఆహార నాళం ఏర్పడకుండా ప్రాణాపాయ స్థితిలో తమ వద్దకు వచ్చిన ఆడ శిశువు ప్రాణాలను కాపాడినట్లు డాక్టర్ చందా భాస్కరరావు చెప్పారు. తల్లి గర్భంలో పిండం ఎదిగే సమయంలో మూడు, నాలుగు వారాల మధ్య కాలంలో ఆహార నాళాలు, ఊపిరితిత్తులు ఏర్పడతాయన్నారు. ఇవి ఏర్పడే సమయంలో ఏదైనా సమస్య తలెత్తితే ఊపిరితిత్తులు, ఆహార నాళం విడిపోకుండా అతుక్కుని పుట్టిన శిశువుకు ప్రాణాపాయం కలుగుతుందన్నారు. సకాలంలో శస్త్రచికిత్స చేస్తే పసికందు ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.

మరిన్ని వార్తలు