ఉద్యోగం ఆశచూపి.. అమ్మేయాలనుకున్నాడు..

10 Jun, 2016 20:26 IST|Sakshi

మలేషియాలో చాక్లెట్ కంపెనీలో ఉద్యోగమని చెప్పి తన భార్యను అమ్మడానికి ప్రయత్నించారని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోఈ ఘటన చోటుచేసుకుంది.

 

బాధితులు తెలిపిన వివరాలివీ.. ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన వెంకటసుబ్బారాయుడు, రమణమ్మలు భార్యాభర్తలు. వెంకట సుబ్బారాయుడు రైతు. వ్యవసాయం కలిసిరాక రూ.4.5 లక్షల వరకు అప్పు అయింది. దానిని తీర్చే దారి కానరాక సతమతమవుతున్నాడు. ఇదే సమయంలో ప్రొద్దుటూరుకు చెందిన ఏజెంటు సుభాన్‌వలీ పరిచయమయ్యాడు.



 భార్యాభర్తలకు మలేషియా చాక్లెట్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. నెలకు చెరో రూ.20వేలు చొప్పన వస్తుందని చెప్పడంతో వారు నిజమేననుకున్నారు. ఈ ఒప్పందం మేరకు మళ్లీ అప్పుచేసి ఆ ఏజెంటుకు రూ.1.20 లక్షలు చెల్లించగా గత నెల 16వ తేదీన రాత్రి హైదరాబాద్ నుంచి విమానంలో మలేషియాకు పంపించాడు. అయితే, అక్కడికి వెళ్లిన తర్వాత.. టూరిస్టు వీసా ఇచ్చి ఏజెంటు మలేషియాకు పంపినట్లు అక్కడి తెలుగు వారు తెలపటంతో మోసపోయినట్లు గ్రహించారు.




అనంతరం వలి పరిచయం చేసిన అక్కడి ఏజెంటు కృష్ణ ఆ దంపతులను తనతోపాటు తీసుకెళ్లి నిర్బంధించాడు. రమణమ్మను ఏజెంటు సుభాన్‌వలి తనకు రూ.60వేలకు అమ్మినట్లు కృష్ణ తెలిపాడు. అంతేకాకుండా రమణమ్మను పలురకాలుగా హింసించాడు. ఇది చూసి తట్టుకోలేక సుబ్బారాయుడు ఆత్మహత్యకు యత్నించాడు. వీరు మాట వినేలా లేరని గ్రహించిన కృష్ణ వదిలిపెట్టాడు. దీంతో వారు బంధువుల సహకారంతో మరో రూ.35 వేలను కృష్ణకు చెల్లించి తిరిగి గత నెల 27వ తేదీన స్వగ్రామానికి చేరుకోగలిగారు. ఈ విషయమై గురువారం బాధితులు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
 

మరిన్ని వార్తలు