ప్రతి కళాశాలలో యాంటీ ర్యాగింగ్‌ కమిటీ

3 Aug, 2017 19:03 IST|Sakshi
ప్రతి కళాశాలలో యాంటీ ర్యాగింగ్‌ కమిటీ

ఎస్కేయూ: ర్యాగింగ్‌ లేని క్యాంపస్‌గా గతంలో ఉన్న పేరును నిలబెట్టాలని అధికారులకు ఎస్కేయూ ఉపకులపతి ఆచార్య కె. రాజగోపాల్‌ అన్నారు. ర్యాగింగ్‌ నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఎస్కేయూలోని పాలక భవనంలో గురువారం ఆయన సమీక్షించారు. ర్యాగింగ్‌ నిరోధానికి తక్షణ చర్యలు తీసుకోవడంలో భాగంగా యాంటీ ర్యాగింగ్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆర్ట్స్‌, సైన్స్‌, ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఎడ్యుకేషన్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆరుగురు ప్రొఫెసర్లతో కూడిన యాంటీ ర్యాగింగ్‌ కమిటీ స్క్వాడ్‌ ఏ హాస్టల్‌నైనా తనిఖీ చేసి ర్యాగింగ్‌కు పాల్బడే వారిపై చర్యలు తీసుకుంటుందన్నారు.

ర్యాగింగ్‌కు పాల్బడితే జరిగే దుష్పరిణామాలపై పోస్టర్లను అన్ని విభాగాలు, హాస్టళ్లలో ప్రదర్శించాలన్నారు. ప్రతి మహిళా వసతి గృహంలో విద్యార్థులకు అందుబాటులో ఓ డిప్యూటీ వార్డెన్‌ ఉంటారన్నారు. ర్యాగింగ్‌కు సంబంధించిన సమాచారం ఇవ్వాలనుకునే వారి కోసం సలహాల పెట్టెలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో రెక్టార్‌ ప్రొఫెసర్‌ హెచ్‌.లజిపతిరాయ్, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.సుధాకర్‌ బాబు, సైన్స్‌  క్యాంపస్‌ కళాశాలల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ వి.రంగస్వామి, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.రాఘవేంద్ర రావు, వార్డెన్‌ ప్రొఫెసర్‌ వి.రంగస్వామి,  ఎస్‌ఈ వి.మధుసూధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు