నా వ్యాఖ్య బాధ కలిగిస్తే క్షమించండి: కోడెల

10 Feb, 2017 01:41 IST|Sakshi
నా వ్యాఖ్య బాధ కలిగిస్తే క్షమించండి: కోడెల

స్పీకర్‌ వంటింటి వ్యాఖ్యలపై మహిళాలోకం ఆగ్రహం

సాక్షి, అమరావతి: మహిళా లోకానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు క్షమాపణలు చెప్పారు. మహిళలు వంటింటికే పరిమితమైతే వేధింపులుండవన్న తన వ్యాఖ్య ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమించాలన్నారు. ‘ఒక వాహనం కొని షెడ్‌లో ఉంచితే ప్రమాదాలు జరగవు. అదే వాహనాన్ని బయటకు తీసుకెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మహిళల పరిస్థితి కూడా అంతే.. వారు వంటింటికే పరిమితమైతే వేధింపులుండవు..‘ అని కోడెల బుధవారం విజయవాడ ‘మీట్‌ ది ప్రెస్‌’లో వ్యాఖ్యానించడం దుమారం రేపింది. (మహిళలు వంటింటికే పరిమితమైతే వేధింపులుండవ్‌)

‘మహిళా సాధికారత–సవాళ్లు’ పేరిట గురువారం విజయవాడలోని ఎంబీభవన్‌లో మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశం స్పీకర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. సమావేశానికి హాజరైన మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య తదితరులు ఈ వ్యవహారం సహా రౌండ్‌టేబుల్‌లో ప్రస్తావనకొచ్చిన అంశాల్ని వెంటనే స్పీకర్‌ దృష్టికి తీసుకువెళ్లారు.  స్పందించిన కోడెల... తానలా అనలేదని, ఎవరైనా అలా అర్థం చేసుకుని బాధపడి ఉంటే సారీ అని అన్నట్టు మహిళాసంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు చెప్పారు.

>
మరిన్ని వార్తలు