దశల వారీగా 20 వేల ఉద్యోగాలు భర్తీ

2 Apr, 2016 16:31 IST|Sakshi
దశల వారీగా 20 వేల ఉద్యోగాలు భర్తీ

విజయవాడ :  దశల వారీగా 20 వేల ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ కేబినేట్ ఆమోదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన  కేబినేట్ సమావేశం శనివారం విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఏపీలో రిజస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేయడంతో పాటు నకిలీ రిజిస్ట్రేషన్ల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని కేబినేట్ సమావేశంలో నిర్ణయించారు.

జాతీయ విద్యాసంస్థలకు భూములు కేటాయించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం, తాడేపల్లిగూడెం, వైజాగ్లలో భూములు కేటాయించనున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం వెబ్ సైట్ ఏర్పాటుతో పాటు అగ్రిగోల్డ్ ఆస్తుల వేలాన్ని వేగవంతం చేసి డిపాజిటర్లకు న్యాయం చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

అలాగే కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు వివిధ శాఖల ఉన్నతాధికారులతో కేంద్రానికి లేఖలు రాయించాలని నిర్ణయించింది. ఇక ఉచిత ఇసుక విధానంపై జీవో జారీకి కేబినేట్ ఆమోదం తెలిపింది. ఏప్రిల్, మే నెలల్లో చంద్రబాబు జిల్లా పర్యటనలు నిర్వహించనున్నారు. ఒక్కో జిల్లాలో రెండు నుంచి మూడు రోజులు పర్యటించి స్థానిక అధికారులు, నేతలతో సమావేశం కానున్నారు.

మరిన్ని వార్తలు