అంతులేని అరాచకాలవి..

26 Mar, 2016 09:23 IST|Sakshi

రాజధాని రైతుల ఆక్రందన
పీసీసీ అధ్యక్షుడురఘువీరారెడ్డి వద్ద ఆవేదన
 
‘ట్రాక్టర్ ఉందని పింఛన్ ఇవ్వట్లేదు. ఉచిత విద్య, వైద్యం అన్నీ ఒట్టిమాటలే. ఉపాధి అవకాశాలు లేక యువత అవస్థలు పడుతోంది. ఓల్టా చట్టానికి తూట్లు పొడిచి నదీగర్భంలో లారీలతో పనులు చేయిస్తున్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అబ్బో.. రాజధాని పేరుతో టీడీపీ చేస్తున్న అరాచకం పరకాష్టకు చేరింది..’ అంటూ రాజధాని ప్రాంత రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. విజయవాడలోని ఆంధరత్న భవన్‌లో శుక్రవారం ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ తీరుపై రైతన్నలు నిప్పులు చెరిగారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..

 
 ఏకపక్ష నిర్ణయాలే..
 రాజధాని ప్రాంతంలో రైతు సమస్యలు పట్టించుకోవట్లేదు. రైతు ప్రతినిధులుగా పేర్కొంటూ పచ్చచొక్కాలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఓ చానల్ తీరు చూస్తే.. దానిని ఆంధ్రప్రదేశ్‌లో కూడా నిషేధిస్తే బాగుండనిపిస్తుంది. వాస్తవాలను వక్రీకరిస్తోంది. బయటి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే విధంగా కథనాలు రాస్తోంది. ప్రసారం చేస్తోంది. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? భూములిచ్చిన రైతులకు రాజధాని ప్రాంతంలో వెయ్యి గజాల భూములు ఇస్తామని చెప్పి ఇప్పుడు అందులో 52 గజాలు కోత పెడుతున్నారు. విద్య, వైద్యానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందడం లేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం యువత ఎదురుచూస్తోంది. అన్ని పార్టీల వారూ భూములు ఇచ్చారు. అధికార పార్టీ వారు మాత్రం పెత్తనం చెలాయిస్తున్నారు. టీడీపీ ఏకపక్ష వైఖరిపై పోరాటం చేయాలని నిర్ణయానికి వచ్చాం. అన్ని పార్టీల రైతులతో రైతు సమాఖ్య ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వారంలో ఇది కార్యరూపం దాల్చుతుంది. మీరు మద్దతు తెలపాలి.
 - నెలికుదిటి వెంకటయ్య, రైతు, దొండపాడు
 
 గ్రామాభివృద్ధికి అడ్డుపడుతున్నారు
 గ్రామాభివృద్ధిని అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారు. కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం తమ ఎంపీ నిధుల నుంచి గ్రామాభివృద్ధికి రూ.30 లక్షలు కేటాయించారు. పనులు చేపట్టేందుకు అనుమతులు మంజూరు కాకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. గ్రామకంఠం సమస్యలు పరిష్కారం కావడం లేదు. జన్మభూమి కమిటీల పేరుతో తెలుగు తమ్ముళ్లు గ్రామంలో అరాచకాలు సృష్టిస్తున్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు.                                                            
 - కొమ్మినేని శివయ్య, సర్పంచి, దొండపాడు
 
 ప్రశ్నించామని.. ట్రాక్టర్లు సీజ్ చేశారు..
 రాజధాని పనులు ట్రాక్టర్లతో చేయించాల్సి ఉంది. ఇందుకు విరుద్ధంగా నదీగర్భంలో టెన్‌టైర్ లారీలతో పనులు చేయిస్తున్నారు. ఇది అన్యాయమని పత్రికా ప్రకటన ఇచ్చా. వెంటనే నా ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఓల్టా చట్టం ప్రకారం నదీగర్భంలో లారీలను అనుమతించకూడదు. ట్రాక్టర్లు ఉన్నాయని పింఛన్లు ఇవ్వట్లేదు. ఆ ట్రాక్టర్లకు పనుల్లేక రైతాంగం పస్తులుంటోంది. మా సమస్యలు చెప్పినా స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు. రాజధానిలో రైతుల భూములు ఎకరం రూ.5కోట్లు అని అసెంబ్లీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. ఇప్పుడు అక్కడ రూ.కోటి 30 లక్షలకే భూమి ధర పడిపోయింది.
 - ఎల్లంకి నర్సయ్య,
 ట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, తుళ్లూరు
 

మరిన్ని వార్తలు