'ఏయ్.. జేసీ నువ్వేం చేస్తున్నావ్'

6 Jan, 2016 03:30 IST|Sakshi
'ఏయ్.. జేసీ నువ్వేం చేస్తున్నావ్'

    ► ఏం తమాషానా.. ఇదేం పాలన?.. వదలను: సీఎం
    ► ‘జన్మభూమి-మీ ఊరు’లో రెవెన్యూ అధికారులపై బాబు మండిపాటు

సాక్షి, విజయవాడ: ‘‘ఏయ్ నువ్వు ఏం చేస్తున్నావ్.. ఏం తమాషాగా ఉందా? ఇదేం అడ్మినిస్ట్రేషన్? ఇక్కడ రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు?  ఏయ్ జేసీ చంద్రుడు.. నువ్వు ఏం చేస్తున్నావ్? నేను ఎవరినీ వదిలిపెట్టను’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ అధికారులపై విరుచుకుపడ్డారు. వీఆర్‌ఓ మొదలుకొని జాయింట్ కలెక్టర్ వరకు రెవెన్యూ అధికారులను జన్మభూమి బహిరంగ సభ వేదికపైకి పిలిచి మరీ తనదైన శైలిలో తీవ్ర స్వరంతో మందలించారు. సీఎం వైఖరి పట్ల అధికారులు నొచ్చుకున్నారు.


కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలులో మంగళవారం ‘జన్మభూమి-మా ఊరు’ సభకు చంద్రబాబు హాజరయ్యారు. అధికారులనే లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు. గ్రామానికి చెందిన పోలేపల్లి అంజలికి సభావేదికపై పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడానికి అధికారులు ఆమెను వేదికపైకి తీసుకొచ్చారు. సీఎం ఆమెతో మాట్లాడారు. నీకు పట్టాదారు పాసు పుస్తకం ఎందుకు? అని సీఎం ప్రశ్నించడంతో పాసుబుక్ లేకపోతే మీ భూమి రికార్డుల్లో ఉండదని అధికారులు చెప్పారని, అందుకే పుస్తకం తీసుకుంటున్నామని చెప్పారు.


దీనిపై సీఎం స్పందిస్తూ.. భవిష్యత్తులో మీభూమి పోర్టల్ ద్వారా ఫాం-1బి తీసుకోవాలి, పట్టాదారు పాసుబుక్ అవసరం లేదు, అధికారులు కావాలని చెప్పడంతో ఇదంతా జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. వేదికపైకి వీఆర్‌ఓ లావణ్యను పిలిచారు. గ్రామంలో ఎంతమందికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చారని ప్రశ్నించారు. 2,008 మందికి గాను 1,474 పుస్తకాలు ఇచ్చామని చెప్పడంతో మిగిలిన వాటి సంగతి ఏంటని నిలదీశారు. వాటిలో తప్పులు ఉన్నాయని వీఆర్‌ఓ చెప్పడంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో ఉన్న రైతులు కూడా పాసు పుస్తకాలు ఇవ్వడం లేదంటూ నినాదాలు చేయడంతో బాబు అధికారులపై మండిపడ్డారు. తహసీల్దార్ నాగేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
పంట సంజీవిని ప్రారంభం
పంటలకు నిత్యం నీరు ఉండడానికి వీలుగా రాష్ట్రప్రభుత్వం రూపొందించిన పంట సంజీవిని పథకాన్ని పెనుగంచిప్రోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. సగటున 3 నుంచి 5 ఎకరాలు ఉన్న ప్రతి పొలంలో పల్లపు ప్రాంతంలో నీటి కుంటను తవ్వుకొని, అక్కడ వర్షపు నీటిని నిల్వ చేసుకొని వినియోగించుకోవాలని సూచించారు.
 

మరిన్ని వార్తలు