చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా

3 Feb, 2017 02:22 IST|Sakshi
చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా

రాజధాని నిర్మాణం ఈనెల 22న పరిపాలన నగరం డిజైన్‌లు ఖరారు
సీఆర్‌డీఏ సమీక్షలో సీఎం


సాక్షి, అమరావతి: ఆంధ్రుల చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా రాజధాని పరిపాలన నగరాన్ని నిర్మించాలని సీఎం చంద్రబాబు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. ఈనెల 22న లండన్‌కు చెందిన మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్స్‌ తుది డిజైన్‌లను సమర్పిస్తారని.. అదే రోజున డిజైన్‌లను ఖరారు చేయాలని సూచించారు. గురువారం వెలగపూడిలోని సచివాలయంలో సీఆర్డీఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిపాలన నగరంలో నిర్మించే భవనాల డిజైన్‌లు అత్యుత్తమంగా ఉండాలని సూచించారు. దీనికోసం కన్సల్టెంట్లు, అధికారులు కలసి పనిచేయాలని ఆదేశించారు. డిజైన్‌లను పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌కు అప్పగించారు.

వచ్చే ఏడాదికి ఆర్థిక నగరం  
 అందమైన ఆర్థిక నగరంగా 2018 నాటికి అమరావతిని తీర్చిదిద్దుతామని, దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గురువారం సచివాలయంలో  ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ భవనాల నిర్మాణ షెడ్యూల్‌ను ప్రకటించారు. అసెంబ్లీని జీ ప్లస్‌ 3 విధానంలో నిర్మిస్తామని, 2018 అక్టోబర్‌ నాటికి పూర్తి చేస్తామన్నారు. హైకోర్టును జీ ప్లస్‌4లో విధానంలో నిర్మిస్తామని, 2019 ఏప్రిల్‌ కల్లా పూర్తి చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు