ఏప్రిల్‌ 24 నుంచి ఏపీ ఎంసెట్‌

24 Jan, 2017 01:38 IST|Sakshi
ఏప్రిల్‌ 24 నుంచి ఏపీ ఎంసెట్‌

ఫిబ్రవరి 15 నుంచి మాక్‌టెస్ట్‌లు
విద్యార్థులకు ఉపయుక్తంగా యాప్‌ ఏర్పాటు
♦  ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల చేసిన మంత్రి గంటా


ఏయూక్యాంపస్‌ (విశాఖ): ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌తో పాటు ఇతర సెట్‌ల తేదీలను ప్రభుత్వం విడుదల చేసింది. ఏప్రిల్‌ 24 నుంచి ఎంసెట్‌ ప్రారంభమవుతుంది. ఈసారి ఆన్‌లైన్‌ పరీక్ష కావడంతో ఇంజినీరింగ్‌ పరీక్షను 24 నుంచి 27 వరకూ నిర్వహించనున్నారు. సంయుక్త ప్రవేశ పరీక్షల తేదీలను సోమవారం సాయంత్రం స్థానిక ఆంధ్రా యూనివర్సిటీ సెనేట్‌ మందిరంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరీక్షల తేదీలు వెల్లడించారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నామని తెలిపారు. పరీక్షల నిర్వహణ బాధ్యత ఏపీ ఆన్‌లైన్‌కు ఇచ్చామని, ఏపీటీఎస్, టీసీఎస్‌ సంయుక్తంగా ఐటీ అండ్‌ సీ విభాగంతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియను చేపడతాయని చెప్పారు. అయితే ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టెస్ట్‌ ఆన్‌లైన్‌ విధానంలో రాదన్నారు. ఆన్‌లైన్‌ పరీక్షలపై విద్యార్థులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘గైడ్‌లైన్స్‌ టు ద స్టూడెంట్‌’ పేరుతో నియమావళిని రూపొందించి వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని, ఆన్‌లైన్‌ టెస్ట్‌లు జరిగే విధానాన్ని వీడియో రూపంలో వెబ్‌సైట్‌లో విద్యార్థుల అవగాహన కోసం ఉంచుతామని పేర్కొన్నారు.

15 నుంచి మాక్‌ టెస్ట్‌లు
విద్యార్థులు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మాక్‌ టెస్ట్‌లు తమ ఇంటి నుంచే సాధన చేయవచ్చని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంత, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేకంగా మాక్‌టెస్ట్‌లతో కూడిన సీడీలు అందిస్తామన్నారు. విద్యార్థులకు ఉపయుక్తంగా ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నామని, పరీక్ష కేంద్రం వివరాలు, హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌  వంటివి యాప్‌ సహాయంతో చేసుకోవచ్చని వెల్లడించారు. హాల్‌టికెట్‌ పరీక్ష కేంద్రం రూట్‌మ్యాప్‌ ముద్రిస్తామన్నారు.

జంబ్లింగ్‌ విధానంలో ప్రాక్టికల్స్‌
ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ను జంబ్లింగ్‌ విధానంలో నిర్వహిస్తామని, దీనిపై విద్యార్థులు ఎటువంటి అపోహ పడవద్దన్నారు.

మరిన్ని వార్తలు