కౌన్సెలింగ్ 'లో' కాలేజీలు

8 Jun, 2017 22:13 IST|Sakshi

► ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో ప్రమాణాల్లేని కాలేజీలకు చోటు
► ఉన్నత విద్యామండలి నివేదిక బుట్టదాఖలు
► పొంతనలేని మంత్రి మాటలు, చేతలు
► పరిశీలన లేని కాలేజీల్లోనూ ఎన్నో లొసుగులు

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహిస్తున్న ఏపీ ఎంసెట్‌-2017 కౌన్సెలింగ్‌లోకి ప్రమాణాలు పాటించని కాలేజీలను కూడా అనుమతించడం విమర్శలకు తావిస్తోంది. ప్రమాణాలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకుంటామని ఒకపక్క రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటిస్తూ మరోపక్క ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌లో వాటిని అనుమతిస్తుండడం విశేషం.

అధ్యాపకులు, మౌలిక వసతుల కల్పన, పరిగణనలోకి తీసుకొని గుర్తింపు ఇస్తాయి. వివిధ విశ్వవిద్యాలయాల్లోని అధికారుల కమిటీలు తమ పరిధిలోని ఇంజనీరింగ్‌ కాలేజీలను తనఖీలు చేపట్టి వాటిలోని ప్రమాణాలపై నివేదికలు అందిస్తాయి. వాటి ఆధారంగా ఆయా కాలేజీలకు విశ్వవిద్యాలయాలు గుర్తింపునిస్తాయి. ఏటా గుర్తింపు పొందుతున్న ఆయా కాలేజీలు ఇపుడు డిమాండ్‌లేని బ్రాంచిలు విద్యార్ధులు చేరని వాటిని స్వచ్ఛందగా వదులుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు.

వాస్తవానికి మౌలిక సదుపాయాలు కల్పించని కాలేజీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాంటి వాటికి గుర్తింపునివ్వకపోవడం, కౌన్సెలింగ్‌లో చేర్చకపోవడం వంటి చర్యలు చేపట్టాలి. కానీ అందుకుభిన్నంగా డిమాండ్‌లేని కోర్సులను వదులుకొంటే చాలని, అలాంటి వాటికి కౌన్సెలింగ్‌లోకి అనుమతిస్తామని చెబుతుండడం విశేషం. ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్‌ పి.నరసింహారావు ఆధ్వర్యంలోని కమిటీ 40 కాలేజీలను తనిఖీ చేసి ఆయా కాలేజీల్లో ఎలాంటి ప్రమాణాలు పాటించడం లేదని తేల్చింది. ఆ కమిటీ పరిశీలించిన కాలేజీల్లో 36 కళాశాలల్లో నిర్దేశిత ప్రమాణాలు లేవని గుర్తించింది. ఫీజులు, ప్రవేశాల కమిటీకి ఆయా కాలేజీలు అనేక సదుపాయాలున్నట్లు చూపించడమే కాకుండా భవిష్యత్తులో తాము ఎన్నో ప​ప్రాజెక్టులు చేపట్టబోతున్నామంటూ తప్పుడు నివేదికలు ఇచ్చి ఫీజులను భారీగా పెంచేలా చేసుకున్నాయి.

ఏఎఫ్‌ఆర్‌సీకి ఆయా కాలేజీలు అందించిన నివేదికల ప్రకారం నరసింహరావు కమిటీ పరిశీలన సాగించింది. అయితే ఆయా కాలేజీలు ఏఎఫ్‌ఆర్‌సీకి ఇచ్చిన నివేదికల్లోని పదిశాతం కూడా కాలేజీల్లో నెలకొల్పలేదని, ఏమీ లేకుండానే కాలేజీలు కొనసాగిస్తున్నాయని గమనించింది. ఆయా కాలేజీలకు ఉన్నత విద్యామండలి నోటీసులు కూడా జారీచేసింది. ఈ కాలేజీల్లో కాకినాడ జేఎన్‌టీయూ పరిధిలో 24 కాలేజీలు, ఉన్నాయి.

ఇందులో 1540 సీట్లను ఆయా కాలేజీల యాజమాన్యాలు వదులుకోవడానికి సిద్ధపడుతున్నాయి. ఈ వర్సిటీ పరిధిలోని 261 కాలేజీల్లో వివిధ బ్రాంచిలకు సంబందించి 17850 సీట్లు తమకు వద్దని ఆయా కాలేజీలు నివేదికలు ఇచ్చాయని అధికారవర్గాలు వివరించాయి. మిగతా 12 కాలేజీల్లో కూడా ప్రమాణాలు లేకుండా పోయాయి. ఇలా ఉండగా ప్రమాణాలు లేని కాలేజీల్లో తగిన చర్యలుచేప చేపట్టాలని ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ వరదరాజన్‌ ఇటీవల అనంతపురం, కాకినాడ జేఎన్‌టీయూ కాలేజీలకు లేఖ రాశారు. ఆయా కాలేజీల్లో విద్యార్ధుల చేరికలు గత ఏడాదిలో చాలా తక్కువగా ఉన్నాయంటూ కోర్సుల వారీగా ఎనె​‍్న కాలేజీల్లో చేరికలు తక్కువగా ఉన్నాయో అందులో వివరించారు.

కోర్సుల వారీగా 40 శాతం ‍కన్నా తక్కువ ఉన్న కాలేజీలు సివిల్‌లో 94, కంప్యూటర్‌ సైన్స్‌లో 59, ఈసీఈలో 89, ఐటీలో 6, మెకానికల్‌లో 97 ఉన్నాయని పేర్కొన్నారు. 40 నుంచి 60 శాతం, 60 నుంచి 80 శాతం, 80 శాతం పైగా ఆయా కోర్సుల్లో చేరికలు ఉన్న కాలేజీల సంఖ్యను కూడా ఆయా వర్సిటీలకు పంపించి వాటిలో ప్రమాణాలు మెరుగుకు వీలుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే ఇప్పుడు ఆ కాలేజీలనీన యధాతథంగా కౌన్సెలింగ్‌లోకి అనుమతించడం విశేషం. ఒకపక్క ఉన్నత విద్యామండలి ఆయా కాలేజీలపై చర్యలు తీసుకోవాలని, ప్రమాణాలు మెరుగుపర్చాలని వర్సిటీలకు లేఖలు రాస్తుండగా మరోపక్క అవే కాలేజీలను కౌన్సెలింగ్‌లోనికి యధాతథంగా అనుమతించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు