రెయిన్‌ట్రీ తో అద్దె బేరాలు పూర్తి

3 Dec, 2015 10:23 IST|Sakshi
రెయిన్‌ట్రీ తో అద్దె బేరాలు పూర్తి
హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్‌కే చెందిన రెయిన్ ట్రీ పార్కులో మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాలకు అపార్టుమెంట్లను, విల్లాలను మూడేళ్ల పాటు అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ రెయిన్ ట్రీ పార్కు యాజమాన్యంతో సంప్రదింపులను చేశారు. ఆ సంస్థ యాజమాన్యం ప్రతిపాదనలకు యనమల ఆమోదం తెలిపారు. వాటికి సీఎం ఆమోదమే తరువాయి.
 
రెయిన్ ట్రీ పార్కులోని అపార్టుమెంట్లలో 500 ఫ్లాట్లు, 100 విల్లాలు ఖాళీగా ఉన్నాయి. ఫ్లాట్లను అఖిల భారత సర్వీసు అధికారుల కోసం, 100 విల్లాలను మంత్రులు, ఎమ్మెల్యేల కోసం అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారు. తాత్కాలిక సచివాలయం ఎక్కడో ఇంకా చెప్పకుండా రెయిన్ ట్రీ పార్కు యాజమాన్యానికి ప్రయోజనం చేకూర్చేందుకే ప్రభుత్వ పెద్దలు ఆరాటపడుతున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. నూతన రాజధాని ప్రాంతం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అద్దెలు ఎక్కువగా ఉండటంతో అధికారులు అద్దె నియంత్రణ చట్టం తీసుకురావాలని ప్రతిపాదించారు. అయితే ముఖ్యమంత్రి దీనికి అంగీకరించలేదు. ఫ్లాట్లు, విల్లాలకు రూ. 12 వేలు, 30 వేలు అద్దెగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ అద్దెలు ఏటా 7 శాతం పెరుగుతాయి. 2 నెలల అద్దె అడ్వాన్స్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఫ్లాట్లలో ఉండేవారు పలు నిర్వహణ చార్జీలు చెల్లించాలని, అవి ఎప్పటికప్పుడు మారుతాయని రెయిన్ ట్రీ యాజమాన్యం పేర్కొంది. అయితే నూతన రాజధానిలో తాత్కాలిక సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేయాలో ఇంకా ఖరారు చేయని రాష్ట్ర ప్రభుత్వం.. మరో పక్క మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాలను మాత్రం నిర్ధారించింది.
 
సదుపాయాల కోసం ఫ్లాట్లలో ఉండేవారు చెల్లించాల్సిన బిల్లులపై ఆ సంస్థ ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి.
 
 నెలకు  జిమ్‌కు రూ. 500, స్విమ్మింగ్ పూల్‌కు రూ. 600, గేమ్స్‌కు రూ. 500 చొప్పున చెల్లించాలి
 అద్దె చెల్లించేందుకు వీలుగా ప్రత్యేకంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఎస్క్రో అకౌంట్ తెరవాలి.
 అద్దె అగ్రిమెంట్‌కు స్టాంపు డ్యూటీ 0.4 శాతం చెల్లించాల్సి ఉంది. దీన్ని మినహాయింపు ఇవ్వాలి.
 నిర్వహణ చార్జీలు కింద నెలకు చదరపు అడుగుకు రూపాయిన్నర చొప్పున అద్దెకు ఉండేవారు చెల్లించాలి.
 విద్యుత్ చార్జీలను, నీటి చార్జీలను అద్దెకు ఉండేవారు నెల నెలా చెల్లించాలి.
మరిన్ని వార్తలు