ఏదో ఒకటే..!

15 Jun, 2017 12:01 IST|Sakshi
ఏదో ఒకటే..!

► బీమాకు ఇన్‌పుట్‌ సబ్సిడీకి లింకు
► మరోసారి రైతులపై సర్కారు చిన్నచూపు
► అన్నదాతలకు తప్పని ఇబ్బందులు


టీడీపీ సర్కార్‌ రైతులను మొదటినుంచి నయవంచనకు గురిచేస్తోంది. రుణమాఫీ విషయంలో మాట తప్పిన సీఎం.. ఇప్పుడు పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీలపై వారిని నిలువునా ముంచేందుకు సిద్ధమయ్యారు. ఒకవైపు అన్నదాతకు మేలు చేసే ప్రభుత్వమని చెబుతూనే మరోవైపు వారిని చిన్నచూపు చూస్తున్నారు.

వేంపల్లె : పంటల బీమా అందిన వారికి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చేందుకు వీల్లేదని..అందుకు సంబంధించిన ఆదేశాలను   ప్రభుత్వం జిల్లాస్థాయి ఉన్నతాధికారులకు పంపింది. దీంతో అధికారులు ఆయా బ్యాంకుల్లో  రుణాలు తీసుకున్న రైతుల వివరాలను సేకరిస్తున్నారు. ఎవరికైతే పంటల బీమా వస్తుందో.. ఆ రైతుకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వకుండా కేవలం  బీమాతో సరిపెట్టాలనే యోచనలో ఉన్నారు. ఈనెల 19వ తేదీనుంచి సంబంధిత పత్రాలు గ్రామ సభల ద్వారా ఇస్తామని అధికారులు చెబుతూనే.. అందులో మొత్తానికి సంబంధించిన కాలం ఖాళీగా ఉంచారు.  బ్యాంకుల వివరాలు ఇచ్చిన తర్వాత  రైతుకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందుతుందా.. పంటల బీమా చేతికి వస్తుందా.. లేదా అనే విషయాన్ని గమనించి ఆ కాలాన్ని పూరించనున్నారు.

2016 ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.77కోట్లు పత్తి, వేరుశనగ, కంది, వరి పంటలకు మంజూరైంది. వేరుశనగకు రూ.62కోట్లు, మిగతా పంటలకు రూ.15కోట్లు వచ్చింది. అయితే ఇన్‌పుట్‌ సబ్సిడీకి, పంటల బీమాకు లింక్‌ పెట్టారు. ఉదాహరణకు హెక్టార్‌కు ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.15.. 2హెక్టార్లకు రూ.30వేలు ఉందనుకుందాం.   బ్యాంకులో తీసుకున్న పంట రుణానికి రూ.40వేలు బీమా వస్తే ఆ రైతుకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందే పరిస్థితి లేదు. కేవలం బీమా మొత్తంతోనే సరిపెట్టుకోవాలి.  ఇక వాతావరణ బీమా వేరుశనగ పంటకు మాత్రమే రూ.56కోట్లు మంజూరైంది.

ఇదెక్కడి న్యాయం
రైతులు బ్యాంకులో తీసుకున్న పంట రుణం రూ.10వేలకు రూ.400నుంచి రూ.500 లెక్కన  బీమా మొత్తాన్ని చెల్లిస్తారు. పంటల బీమా సంస్థలు ప్రైవేట్‌ సంస్థలుగా ఉన్నాయి. రైతులు తమ సొంత డబ్బులను బీమా ప్రీమియం కింద చెల్లిస్తే దీనికి, ఇన్‌పుట్‌ సబ్సిడీకి లింక్‌ పెట్టడం ఏమిటని రైతులు  మండిపడుతున్నారు. రుణమాఫీ విషయంలో మాట తప్పిన చంద్రబాబు  మరోసారి రైతులపై  ఉక్కుపాదం మోపుతున్నారని.. ఇది ఎంతవరకు సమంజసమని అంటున్నారు. ఈవిషయమై ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వంపై పోరాటం చేయాలని రైతులు కోరుతున్నారు.   పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ మొత్తాలు ఇప్పుడే రైతులకు అందే పరిస్థితి కనిపించలేదు. సుమారు మూడు నెలలు  పట్టే అవకాశం ఉంది. జిల్లాలో 61మంది రైతులు ఉన్నారు. వీరి వివరాలను ఆయా బ్యాంకులనుంచి వ్యవసాయశాఖాధికారులు తెప్పించుకోవాలి. వీరికి పంటల బీమా ఏ మేరకు పోతుందో పరిశీలించాలి. తర్వాత  బీమా రూ.30వేలలోపు ఉన్న రైతులను ఎంపిక చేసి ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించనున్నారు. చంద్రబాబు మాత్రం మంగళవారం ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల చేస్తున్నామని చెప్పినా.. రైతులకు మాత్రం అందే పరిస్థితిలేదు.

రైతులంటే చంద్రబాబుకు చులకన..
 సీఎం చంద్రబాబుకు రైతులంటే చులకన. వర్షాభావంతో అల్లాడుతుంటే ఆదుకోకుండా  ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం మంచిపద్దతి కాదు. ఇన్‌పుట్‌ సబ్సిడీ,  బీమా రెండు దక్కితే కానీ రైతులు పంటలు సాగు చేసే పరిస్థితి లేదు. –ఎస్‌.మధుసూదన్‌రెడ్డి(రైతు), నాగూరు

రైతులు క్షమించరు..
చంద్రబాబు ప్రభుత్వాన్ని రైతులు క్షమించే పరిస్థితిలేదు. మోసపూరిత విధానాలతో ఇబ్బంది పెడుతున్నారు. మోసం చేస్తే పుట్టగతులు ఉండవు. ఇప్పటికైనా నిర్ణయాన్ని మార్చుకోవాలి.  ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమాకు  రెండూ అందజేయాలి. –సి.చిన్నగంగన్న(రైతు), కత్తలూరు

ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి..
ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా పంపిణీ విషయంపై ప్రభుత్వం  నుంచి ఇప్పటికే ఆదేశాలు అందాయి.రెండు హెక్టార్లకు ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.30వేలు రైతుకు అందుతుంది. ఈ మొత్తం అందే వారికి  బీమా వస్తే ఇన్‌పుట్‌ సబ్సిడీ రాదు. ఇప్పటికే  బ్యాంకులనుంచి వివరాలు తెప్పించుకుంటున్నాం. ఈనెల 19వ తేదీ నుంచి పత్రాలు రైతులకు అందజేసి ఎవరికి ఎంత మొత్తంలో అందుతుందో ఆయా మండల వ్యవసాయాధికారులు తెలియజేస్తారు. ప్రభుత్వ ఆదేశాలను తాము   తప్పకుండా పాటించాల్సి ఉంది. – ఠాగూర్‌ నాయక్‌ (వ్యవసాయ శాఖ జేడీ), కడప

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా