కాంట్రాక్టు అధ్యాపకులతో చెలగాటమా ?

22 Sep, 2017 13:58 IST|Sakshi
వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి

ప్రభుత్వంపై మండిపడిన వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి
వివిధ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా


గుంటూరు ఎడ్యుకేషన్‌ :
కాంట్రాక్టు అధ్యాపకుల జీవితాలతో ప్రభుత్వానికి చెలగాటం  తగదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో కాంట్రాక్టు అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం లక్ష్మీపురంలోని ఇంటర్మీడియెట్‌ బోర్డు కమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ‘కాంట్రాక్టు అధ్యాపకుల కుటుంబాల కన్నీటి ఘోష’ పేరుతో నిర్వహించిన రాష్ట్రస్థాయి ధర్నాలో ఏపీఎన్జీవో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి. అశోక్‌బాబు, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు రాము సూర్యారావు, వై. శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేస్తామని హమీ ఇచ్చిన చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  

వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నెరవేరుస్తారు
అధికారంలోకి రాగానే కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పిన  వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తన హామీ నెరవేర్చుతారని అప్పిరెడ్డి చెప్పారు. ప్రభుత్వ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీజే గాంధీ మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు రూల్స్‌ను అమలు పరిచే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకులను ఉద్యోగాల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఉత్తర్వులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. బాబురెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి సర్వీసు రూల్స్‌ ద్వారా జూనియర్‌ లెక్చరర్లుగా పదోన్నతి పొందినప్పటికీ అధ్యాపక నియామకాలకు ఉపాధ్యాయులు ఏనాడూ వ్యతిరేకం కాదని చెప్పారు.  

టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలోనే ఉంది: కేఎస్‌ లక్ష్మణరావు
మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ పెట్టిందన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేశు మాట్లాడుతూ నిత్యం విలువలు వల్లించే చంద్రబాబు అతి పెద్ధ మోసకారి అని విమర్శించారు. ధర్నాలో ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె. శ్రీనివాస యాదవ్, కోశాధికారి హరినాథ రెడ్డి, ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బాజిత్‌ బాషా, కార్యదర్శి రాంబాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుబ్బారావు, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బి. లక్ష్మణరావు, ఎస్‌ఎఫ్‌ఐ గరల్స్‌ వింగ్‌ జిల్లా కన్వీనర్‌ జ్యోతి తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

మరిన్ని వార్తలు