పేరుకే మంత్రి.. పాపం మాట వినేవారులేరు

11 Jan, 2016 19:40 IST|Sakshi
పేరుకే మంత్రి.. పాపం మాట వినేవారులేరు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు పేరుకే మంత్రి కానీ ఆయన మాట వినేవారు లేరు. దేవాదాయ శాఖలో అధికారులదే ఆధిపత్యం. అటు ప్రభుత్వం కానీ, ఇటు అధికారులు కానీ మాణిక్యాలరావును పూర్తిగా పక్కనబెట్టినట్టు సమాచారం. మాణిక్యాలరావుకు తెలియకుండానే దేవాదాయ శాఖలో జీవోలు జారీ చేస్తున్నారు.

మాణిక్యాల రావు దేవాదాయ శాఖ మంత్రి హోదాలో ఇచ్చిన లేఖలను టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదు. దర్శనం కోసం ఇచ్చిన సిఫారసు లేఖలను పక్కనపడేస్తున్నారు. ఇక దేవుడి డైరీలు దేవాదాయ శాఖ మంత్రికి పంపడంలోనూ ఇదే తీరు. 100 చొప్పున టీటీడీ డైరీలు, క్యాలెండర్లకు మంత్రి ఆర్డర్ ఇవ్వగా, టీటీడీ అధికారులు మాత్రం పదేసి పంపారు. గోదావరి పుష్కరాల్లోనూ మంత్రి ప్రమేయం పరిమితం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నుంచి బీజేపీ తరపున శాసనసభకు ఎన్నికైన మాణిక్యాల రావు.. మిత్రపక్షం టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కినా, ఆయన మాట వినేవారే లేకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు.

మరిన్ని వార్తలు