ఇక ఈజీగా ఫ్యాన్సీ నెంబర్లు..

1 Mar, 2016 08:40 IST|Sakshi
ఇక ఈజీగా ఫ్యాన్సీ నెంబర్లు..

► రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఫ్యాన్సీ నంబర్లు తీసుకోవచ్చు
► డిమాండ్‌కు తగ్గట్టుగా ఆదాయం రాబట్టే యోచన
► త్వరలో కొత్త విధానం అమలు
► ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న రవాణా శాఖ

విశాఖపట్టణం : వాహనాల ఫ్యాన్సీ నంబర్లను రాష్ట్రంలో ఏ జిల్లావైనా.. ఎక్కడి నుంచైనా పొందేందుకు రవాణా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న డిమాండ్ బట్టి ఆదాయం రాబట్టడానికి సిద్ధపడుతోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఆయా జిల్లాల రవాణా కార్యాలయం పరిధిలో వచ్చే నంబర్లను ఎక్కడికక్కడ కేటాయిస్తున్నారు. దీంతో మంత్రులు, ఇతరత్రా ప్రజాప్రతినిధుల సిఫారసులు, ఒత్తిళ్లకు తలొగ్గుతున్న రవాణా అధికారులు లక్షలాది రూపాయలు రాబట్టే అవకాశమున్న ఫ్యాన్సీ నంబర్లను కనీస ధరలకు కట్టబెడుతున్నారు.

ఇక నుంచి ఎటువంటి సిఫారసులకు తావు లేకుండా వాహనదారుడికి నేరుగా నంబర్ దక్కేలా చేయాలని రవాణా శాఖ కమిషనర్ ఎన్.సుబ్రహ్మణ్యం నిర్ణయించారు. మార్చి ఒకటో తేదీ నుంచి విశాఖ జిల్లాలో కొత్త వాహనాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించడానికి రవాణా యంత్రాంగం సిద్ధపడుతోంది. ఈ వ్యవస్థను రూపొందించే బాధ్యత పమ్‌సాఫ్ట్ సంస్థకు అప్పగించారు. రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన తర్వాత ఆన్‌లైన్‌లో ఫ్యాన్సీ నంబర్లు కేటాయింపునకు విధి విధానాలు రూపొందిస్తారు.
 
 అంతా ఆన్‌లైన్‌లోనే..: ‘ఈ-బై’ విధానంలో ఇక నుంచి రాష్ట్రంలో 13 జిల్లాలకు సంబంధించిన వాహన రిజిస్ట్రేషన్ నంబర్లను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ఆయా జిల్లాల సిరీస్‌లో వచ్చే ఫ్యాన్సీ నంబర్లను అమ్మకానికి పెడతారు. జిల్లా, స్థానికతతో సంబంధం లేకుండా వాహనదారులు వాటిని కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు విశాఖలో ఎపి 31 డిడి 9999 ఫ్యాన్సీ నంబర్‌ను రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల వాహనదారులు కూడా పోటీపడి పొందవచ్చు. అలాగే ఇతర జిల్లాలకు చెందిన నంబర్లు విశాఖలో తీసుకోవచ్చు. ఆయా జిల్లాల రిజిస్ట్రేషన్, చిరునామాతో నిమిత్తం లేకుండా ఫ్యాన్సీ నంబర్ సొంతం చేసుకోవచ్చు.

ఇటీవల కాలంలో విజయవాడ, విశాఖ, నెల్లూరు, తిరుపతి, గుంటూరు నగరాల్లో ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ బాగా పెరిగింది. సీల్డ్ టెండర్ విధానంలో లక్షలాది రూపాయలు చెల్లించి ఫ్యాన్సీ నంబర్లు పొందుతున్నారు. వీటిని జిల్లాల వారీగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పోటీ పడే వీలు కల్పిస్తే మరింత ఆదాయం వస్తుందన్నది రవాణా శాఖ అధికారుల ఆలోచన. కొత్త విధానాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ప్రముఖ ఫ్యాన్సీ నంబర్ల కనీస ధర రూ.50 వేలు ఉండగా ఇక నుంచి లక్ష రూపాయలు చేయాలన్న దానిపై కూడా కమిషనర్ అభిప్రాయ సేకరణ జరిపినట్లు తెలిసింది.
 
 

మరిన్ని వార్తలు