వాయిదా పద్థతిలో ఫైవ్‌స్టార్ ఫ్యాన్లు

16 May, 2016 20:22 IST|Sakshi

- పెలైట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా
- లక్ష ఫ్యాన్ల పంపిణీ.. ఒక్కొక్కటీ రూ.1,400
- ఏపీఈఆర్‌సీ అనుమతి కోరిన ఎస్పీడీసీఎల్


హైదరాబాద్: ఏపీలోని విద్యుత్ వినియోగదారులకు వాయిదాల పద్ధతిలో 5 స్టార్ ఫ్యాన్లు ఇవ్వబోతున్నారు. ఇందుకోసం కృష్ణా జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా గుర్తించి, తొలుత ఇక్కడ లక్ష ఫ్యాన్లు అందించాలని నిర్ణయించారు. ఈ పథకానికి అనుమతివ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)ని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) సోమవారం కోరింది. సంస్థ ప్రతినిధులు ఫ్యాన్ల అమ్మకాలకు సంబంధించిన వివరాలతో సమగ్ర నివేదికను సమర్పించారు. ఏపీఈఆర్‌సీ అనుమతి రావడంతోనే ఫ్యాన్ల అమ్మకాలు మొదలుపెడతామని అధికారులు తెలిపారు. ఇంధన పొదుపులో భాగంగా కేంద్ర ఇంధన పొదుపు సంస్థ (ఈఈఎస్‌ఎల్) కృష్ణా జిల్లాకు లక్ష ఫ్యాన్లు అందిస్తోంది. టెండర్ల ద్వారా ఈ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు.

ఒక్కో ఫ్యాన్ ఖరీదు రూ.1,400. వీటిని 24 నెలల సులభవాయిదాల్లో వినియోగదారుడు చెల్లించాల్సి ఉంటుంది. నెలకు సుమారు రూ.60 వరకూ ఇన్‌స్టాల్‌మెంట్‌గా వసూలు చేస్తారు. ఈ మొత్తాన్ని నెలవారీ విద్యుత్ బిల్లులో కలుపుతారు. ఒకవేళ వినియోగదారుడు వాయిదాల పద్ధతి అవసరం లేదనుకుంటే, రూ.1,260 కే ఫ్యాన్‌ను అందజేస్తారు. బజాజ్, ఉషా ఫ్యాన్లను పంపిణీ చేయబోతున్నట్టు ఏపీఈఆర్‌సీకి ఎస్పీడీసీఎల్ తెలిపింది. విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేసే వాయిదా సొమ్మును పంపిణీ సంస్థ నేరుగా ఈఈఎస్‌ఎల్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. ఏ ఒక్క నెలలో వాయిదా చెల్లించకపోయినా వినియోగదారుడి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు.

డిస్కమ్‌ల అయిష్టత
ఫ్యాన్ల పంపిణీ పథకంపై విద్యుత్ పంపిణీ సంస్థలు అయిష్టంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే సిబ్బంది కొరత వెంటాడుతుంటే, ఫ్యాన్ల అమ్మకాల కోసం దుకాణాలు తెరవాల్సిన పరిస్థితి ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నారు. ఫ్యాన్లను ఈఈఎస్‌ఎల్ నేరుగా విద్యుత్ సెక్షన్ కార్యాలయాలకు పంపుతుంది. ఒకవేళ అవి పనిచేయకపోయినా, చెడిపోయినా తాము బాధ్యత వహించలేమని పేర్కొంటున్నారు. వినియోగదారుడు నేరుగా ఈఈఎస్‌ఎల్‌తో సంప్రదించాల్సిరావడం సాధ్యమయ్యే పనికాదంటున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఆగ్రహించే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదీగాక ఇందుకు సంబంధించిన రికార్డులు నిర్వహించడం కూడా సమస్యేనని, క్షేత్రస్థాయి సిబ్బంది నాణ్యతలేని ఫ్యాన్లు అందించినా నియంత్రించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం బలవంతంగా దీన్ని తమపై రుద్దుతోందని విద్యుత్ అధికారులు వాపోతున్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు