చర్చంతా 'కృష్ణా'పైనే..

17 Sep, 2016 03:44 IST|Sakshi
చర్చంతా 'కృష్ణా'పైనే..

‘అపెక్స్ కౌన్సిల్’ ఎజెండాను ఖరారు చేసిన  చైర్‌పర్సన్ ఉమాభారతి
పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపైనే ప్రధానంగా చర్చ
పట్టిసీమ, పోలవరం జలాల్లో వాటాపై తేల్చేది కృష్ణా ట్రిబ్యునలేనని స్పష్టీకరణ  
గోదావరి ప్రాజెక్టులపై చర్చకు స్పష్టమైన హామీ ఇవ్వని కేంద్ర జల వనరుల శాఖ
ఈనెల 21న అపెక్స్ కౌన్సిల్ సమావేశం..
పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులతో ఏపీకి తీవ్ర నష్టం
శ్రీశెలం నుంచి 120 టీఎంసీలు తోడుకోనున్న తెలంగాణ సర్కారు
రాయలసీమ, నాగార్జునసాగర్, పులిచింతల ఆయకట్టు, కృష్ణా డెల్టాకు కష్టాలే
ఏపీ ప్రభుత్వం కౌన్సిల్‌లో సమర్థంగా వాదనలు వినిపించాలి
రాష్ట్ర ప్రజలకు జరిగే అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి
సాగునీటి రంగ నిపుణుల సూచన     

 
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో చేపట్టిన ప్రాజెక్టులపైనే ‘అపెక్స్ కౌన్సిల్’లో ప్రధానంగా చర్చించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎజెండాను ఖరారు చేసింది. ఈ నెల 21న కౌన్సిల్ సమావేశానికి హాజరు కావాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖరరావులకు సమాచారం పంపింది. పోలవరం, పట్టిసీమ ఎత్తిపోతల తదితర గోదావరి ప్రాజెక్టులపైనా చర్చించాలన్న ప్రతిపాదనపై కేంద్ర జల వనరుల శాఖ మంత్రి, అపెక్స్ కౌన్సిల్ చైర్‌పర్సన్ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం గమనార్హం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర జల వనరుల వాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జీత్ సింగ్ శుక్రవారం వేర్వేరుగా లేఖలు రాశారు.

కృష్ణా పరీవాహక ప్రాంతంలో నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల వివాదాన్ని పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 21న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి సిద్ధమయ్యారు. పట్టిసీమ ఎత్తిపోతల, పోలవరం ప్రాజెక్టుల ద్వారా కృష్ణా డెల్టాకు ఏపీ ప్రభుత్వం మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో 90 టీఎంసీల వాటా తమకు కేటాయించాలని, దానిపై చర్చించాలన్న తెలంగాణ సర్కారు ప్రతిపాదనపై కృష్ణా ట్రిబ్యునల్‌లో తేల్చుకోవాలని ఇప్పటికే సూచించామని, అపెక్స్ కౌన్సిల్‌లో దాన్ని చర్చించలేమని స్పష్టం చేశారు.
 
సమర్థంగా వాదనలు వినిపిస్తేనే...
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు 21న జరగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఎంతో కీలకమైనది. రాష్ట్ర ప్రయోజనాలకు కాపాడాలంటే... అనుమతుల్లేకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై కౌన్సిల్‌లో ఏపీ ప్రభుత్వం సమర్థంగా వాదనలు వినిపించాలని సాగునీటి రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల ఏపీకి వాటిల్లే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెబుతున్నారు. ఈ విషయంలో ఏమాత్రం విఫలమైనా రాష్ట్ర ప్రజానీకానికి తీరని అన్యాయం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
 
సమయాన్ని బట్టి ఆర్డీఎస్‌పై చర్చిద్దాం  
ఆర్డీఎస్(రాజోలి బండ డైవర్షన్ స్కీం) కుడి కాలువ ను తవ్వేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైందని, దానికి అనుమతులు లేవంటూ తెలంగాణ సర్కారు చేసిన ఫిర్యాదుపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. సమయాన్ని బట్టి ఈ అంశంపై అపెక్స్ కౌన్సిల్‌లో చర్చిద్దామని హామీ ఇచ్చింది. గోదావరి జలాల వినియోగంపై తమను సంప్రదించకుండా మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవడం, ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో అనుమతి లేకుండా 135 టీఎంసీల వినియోగానికి సిద్ధమవడంపై చర్చించాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదననూ కేంద్రం సున్నితంగా తోసిపుచ్చింది.

ఈ అంశాన్ని అజెండాలో చేర్చలేమని, వీలును బట్టి చర్చిద్దామంటూ దాటవేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అజెండాను ఖరారు చేసిన అపెక్స్ కౌన్సిల్ చైర్ పర్సన్ ఉమాభారతి.. ఈ నెల 21న సమావేశానికి హాజరు కావాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లకు శుక్రవారం రాత్రి నోటీసులు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
 
ఆ ప్రాజెక్టులతో ఏపీ ఎడారే!
రాయలసీమలోని నాలుగు జిల్లాలతోపాటు కృష్ణా డెల్టా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కృష్ణా నది వరప్రదాయిని. ఈ నదిపై ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు ఇప్పటికే లెక్కలేనన్ని ప్రాజెక్టులు, బ్యారేజీలు, లిఫ్ట్‌లు కట్టడంతో దిగువకు చుక్కనీరు రాని దుస్థితి నెలకొంది. అన్ని అడ్డంకులు దాటుకొని, శ్రీశైలంలోకి నీరు వచ్చినా.. దాన్ని తోడేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతుల్లేకుండా పాలమూరు-రంగారెడ్డి, డిండి లిఫ్ట్‌లను ఏర్పాటు చేస్తోంది. ఈ లిఫ్ట్‌ల ద్వారా శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీల నీటిని తోడుకోవాలని నిర్ణయించింది. శ్రీశైలం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు.

ఈ మట్టం వద్ద గరిష్టంగా 215 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సిల్ లెవల్ 840 అడుగులు అయినప్పటికీ శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం ఉంటే తప్ప దాని ద్వారా రాయలసీమకు నీరివ్వడం సాధ్యం కాదు. వెలిగొండ ప్రాజెక్టుకు నీరివ్వాలన్నా శ్రీశైలంలో 854 అడుగుల మట్టాన్ని కొనసాగించాలి. కానీ, 800 అడుగల వద్దే నీటిని తోడుకునేలా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మిస్తోంది. రోజుకు 2 టీఎంసీల చొప్పున తోడేస్తే.. భారీ వరద ఉంటే తప్ప శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగులకు చేరడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు కనీవినీ ఎరుగని నష్టం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీశైలం నుంచి నీటిని తెలంగాణ తోడేస్తే రాయలసీమతోపాటు దిగువనున్న నాగార్జునసాగర్, పులిచింతల ఆయకట్టు, కృష్ణా డెల్టాకు కష్టాలు తప్పవు.

మరిన్ని వార్తలు