ఉద్యోగులకు అండగా ఉంటా..

6 Nov, 2016 23:28 IST|Sakshi
ఉద్యోగులకు అండగా ఉంటా..
 
  •   ఏపీపీఆర్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు 
  •   పదవులన్నింటినీ దక్కించుకున్న బండి శ్రీనివాసరావు ప్యానెల్‌ 
  •   రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా కూచిపూడి మోహన్‌రావు
 
గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడుగా బండి శ్రీనివాసరావు భారీ మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు. జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడుగా ఉన్న ఆయన రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నిక కావడంతో జెడ్పీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
   రాష్ట్ర అధ్యక్షుడుగా గెలుపొందిన బండి శ్రీనివాసరావు ’సాక్షి’కి ఫోన్‌ ద్వారా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పాటుపడతానని తెలియజేశారు. తనపై నమ్మకంతో ఉద్యోగులు అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రికార్డు అసిస్టెంట్‌ పోస్టులను అప్‌గ్రెడేషన్‌ కోసం పాటుపడతానని చెప్పారు. సూపరింటెండెంట్‌ పదోన్నతుల్లో 34 శాతం ఇయర్‌మార్క్‌ కల్పించేలా ప్రయత్నిస్తానని, సూపరింటెండెంట్‌ పోస్టులకు గెజిటెడ్‌ హోదా కోసం కృషి చేస్తానని చెప్పారు. నూతన రాజధానిలో అసోసియేషన్‌ కార్యాలయ భవన నిర్మాణం చేపడతామని తెలిపారు. 
 ఏకపక్షంగా జరిగిన ఎన్నికలు
   ఏపీపీఆర్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు ఆదివారం విజయవాడ రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగాయి. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అనంతరం ఓటింగ్‌ ప్రక్రియను నిర్వహించారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో జరిగిన తొలి ఎన్నికలు కావడంతో రాష్ట్ర అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు తీవ్రంగా కృషి చేశారు. జిల్లా పీఆర్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్యానల్, అనంతపురం జిల్లా అధ్యక్షుడుగా ఉన్న గంధమనేని శ్రీనివాస్‌ ప్యానెళ్లు ఎన్నికల్లో తలపడ్డాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలకుగాను ఒక్కో జిల్లాకు ఆరుమంది చొప్పున 78 మంది ఓటర్లు ఉన్నారు. గుంటూరు రాజధాని ప్రాంతం కావడం వల్ల ఈ ప్రాంతానికి చెందినవారు రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటే ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కరించుకునే వీలుకలుగుతుందనే ఆలోచనతో మెజార్టీ జిల్లాల నాయకులు బండి శ్రీనివాసరావుకు మద్దతుగా నిలిచి గెలిపించారు. 
రాష్ట్ర కమిటీ ఇదే..
    మొత్తం 78 ఓట్లకుగాను బండి శ్రీనివాసరావుకు 57 ఓట్లు లభించి భారీ మెజార్టీతో గెలుపొందారు. గంధమనేని శ్రీనివాస్‌కు 21 ఓట్లు లభించాయి. బండి శ్రీనివాసరావు ప్యానెల్‌ నుంచి పోటీచేసిన వారంతా ఏకపక్షంగా గెలుపొందడం విశేషం. రాష్ట్ర కార్యదర్శిగా సీ.నాగిరెడ్డి(కడప), అసోసియేట్‌ అధ్యక్షుడుగా వి.రమేష్‌(తూర్పు గోదావరి), కోశాధికారిగా దస్తగిరిబాబు(కర్నూలు), జాయింట్‌ సెక్రటరీగా జీ.గీతారాణి (ఏకగ్రీవం, కర్నూలు జిల్లా) ఉపాధ్యక్షులుగా గోపీనా«ద్‌(నెల్లూరు), లాలప్పరెడ్డి(ప్రకాశం), రామ్మోహన్‌(శ్రీకాకుళం), ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగా కూచిపూడి మోహన్‌రావు(గుంటూరు), చక్రపాణి(చిత్తూరు), కే.వీ.శ్రీనివాసరావు(నెల్లూరు), కే.శ్రీనివాసరావు(శ్రీకాకుళం), రవీంద్రబాబు (ఏకగ్రీవం, శ్రీకాకుళం జిల్లా), డీ.అజయ్‌కుమార్‌( ఏకగ్రీవం, కృష్ణాజిల్లా), జాయింట్‌ కోఆర్డినేషన్‌ కమిటీ సభ్యుడుగా సీహెచ్‌.శ్రీనివాసరావు(ప్రకాశం) గెలుపొందారు. ఎన్నికల్లో గెలుపొందిన వారందరికీ నియామకపు పత్రాలను అందజేశారు. ఎన్నికల అధికారిగా యెండ్లూరి బ్రహ్మయ్య, సహాయ ఎన్నికల అధికారిగా ఆంజనేయులు, ఎన్నికల పరిశీలకుడుగా రాజశేఖర్‌ వ్యవహరించారు. 
 
మరిన్ని వార్తలు