అప్పుడు కట్టొద్దన్నారు

16 Sep, 2016 01:02 IST|Sakshi
అప్పుడు కట్టొద్దన్నారు
జంగారెడ్డిగూడెం : డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను వడ్డీతో సహా తక్షణమే చెల్లించాలంటూ జంగారెడ్డిగూడెం ఆంధ్రాబ్యాంక్‌ నుంచి 170 మంది మహిళలకు నోటీసులు అందాయి. దీంతో ఆ మహిళలంతా బ్యాంక్‌ ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. స్థానిక జగ్జీవన్‌రామ్‌ నగర్‌లో 17 గ్రూపులకు సంబంధించి 170 మందికి బ్యాంక్‌ అధికారుల నుంచి నోటీసులు అందాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, వాటిని అందుకున్న మహిళలంతా బ్యాంక్‌ వద్దకు చేరుకుని ఇదేం దారుణమంటూ అధికారులను నిలదీశారు. 
మరణించిన వారినీ వదల్లేదు
మృతి చెందిన డ్వాక్రా మహిళల పేరిట కూడా నోటీసులు జారీ అవుతున్నాయి. వర్షిత గ్రూపునకు చెందిన పినెల్లి సావిత్రి ఏడాది క్రితం మరణించింది. సావిత్రి తల్లి ముప్పిడి వీరమ్మ కూలి పనులు చేసుకుంటూ మనుమరాలిని చదివించుకుంటోంది. వర్షిత గ్రూప్‌లోని సభ్యులంతా కలసి రూ.50 వేలు రుణం తీసుకోగా, రూ. 80వేలు
చెల్లించాలని అధికారులు నోటీసు పంపించారు. మృతురాలు సావిత్రికి పిన్నికూతురైన మల్లెల రఘుపతి ఆ నోటీసు తీసుకుని ఆందోళనతో బ్యాంక్‌కు చేరుకుంది. 
నడ్డివిరిచే వడ్డీలు
జగ్జీవన్‌రామ్‌ నగర్‌లోని పావని గ్రూప్‌ మహిళలు రూ.1.47 లక్షలను రుణం తీసుకోగా, వడ్డీతో కలిపి రూ.2.92 లక్షలు చెల్లించాలంటూ నోటీసులు అందాయి. ఇదే గ్రూప్‌ సభ్యులు గృహ రుణం కింద రూ.80 వేలు తీసుకోగా, రూ.2.46 లక్షలు కట్టాలంటూ నోటీసులు ఇచ్చారు. భార్గవి గ్రూప్‌ మహిళలు రూ.లక్ష తీసుకోగా, వడ్డీతో కలిపి రూ.2.87 లక్షలు చెల్లించాలని.. అరుంధతి గ్రూప్‌ సభ్యులు రూ.1.81 లక్షల రుణం తీసుకోగా, రూ 3.51 లక్షలు చెల్లించాలని బ్యాంక్‌ అధికారులు నోటీసులు పంపించారు.
అప్పుడు కట్టొద్దని.. ఇప్పుడు నోటీసులా
నోటీసులు అందుకున్న 17 గ్రూపులకు చెందిన 170 మంది మహిళలు బ్యాంక్‌ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని నమ్మబలికారని, ఎవరూ ఒక్క రూపాయి కూడా బ్యాంక్‌ రుణం చెల్లించవద్దని ఎన్నికల సభల్లో చెప్పారని బాధిత మహిళలంతా గుర్తు చేశారు. ఇప్పుడు అసలుకు రెండింతలు వడ్డీ వేసి తమ నడ్డి విరిగేలా నోటీసులు ఇచ్చి రుణాల వసూళ్లకు తమ ఇళ్లపైకి వస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. రుణం చెల్లించకపోతే తమ ఇళ్లకు తాళాలు వేస్తామంటున్నారని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని మహిళలు అవేదన వ్యక్తం చేశారు.
అరచేతిలో వైకుంఠం చూపారు
ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అరచేతిలో వైకుంఠం చూపారని మహిళలు ధ్వజమెత్తారు. ‘తీసుకున్న రుణాలకు ఎటువంటి వడ్డీలు చెల్లించవద్దన్నారు. అసలుతోపాటు వడ్డీలు మాఫీ చేస్తామన్నారు. ఇప్పటికీ మాఫీ చేయలేదు. బ్యాంక్‌ అధికారులు ఆ హామీల విషయం మాకు తెలియదంటున్నారు. రుణం కట్టాల్సిందే అంటున్నారు. ఇదేం ఇరకాటమో అర్థం కావడం లేదు’ అని వాపోయారు. రుణమాఫీ చేయడం చేతకాదని చెబితే తినో, తినకో రుణాలు తీర్చుకునే వాళ్లమని, ఇప్పుడు పెద్దఎత్తున వడ్డీలు వేసి అసలు కంటే రెండు రెట్లు చెల్లించాలని నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది హామీలు అమలు చేయడమా.. ప్రజలను వంచించడమా అని ప్రశ్నించారు. 
 
దారుణంగా మోసగించారు
కూలీ నాలీ చేసుకుని బతుకున్నాం. అంతంత వడ్డీలు ఎలా కట్టాలి. చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామన్నారని కట్టలేదు. తీరా.. రుణం రద్దుకాకపోగా రూ.1.20 లక్షలు  తీసుకుంటే ఇప్పుడు రూ.3 లక్షలు కట్టమని నోటీసులు అందాయి. ఈ మొత్తాన్ని మేం ఎలా కట్టాలి. మమ్మల్ని దారుణంగా మోసం చేశారు. 
– బొబ్బర వెంకాయమ్మ, డ్వాక్రా మహిళ, జంగారెడ్డిగూడెం
 
అధికారులు బెదిరిస్తున్నారు
బ్యాంక్‌ అధికారులు బెదిరిస్తున్నారు. డ్వాక్రా రుణం చెల్లించకపోతే ఇళ్లకు తాళాలు వేస్తామంటున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు డ్వాక్రా రుణం మాఫీ చేస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. రూ.లక్ష తీసుకుంటే వడ్డీతో కలిపి రూ.2.50 లక్షలు అయ్యింది. రోజువారీ పనిచేసుకునే మేం ఇంత సొమ్ము ఎక్కడినుంచి తెచ్చి కట్టాలి.
– కొత్తూరు లక్ష్మి, డ్వాక్రా మహిళ, జంగారెడ్డిగూడెం
 
చనిపోయిన వాళ్లకూ నోటీసులు ఇచ్చారు
మా పెద్దమ్మ కూతురు పినెల్లి సావిత్రి. ఆమె మృతిచెంది ఏడాదైంది. చనిపోయిన సావిత్రి పేరిట కూడా రుణం కట్టాలని నోటీసులు ఇచ్చారు. మా పెద్దమ్మ ముప్పిడి వీరమ్మ వృద్ధురాలు. కూలి పనులు చేసుకుంటూ సావిత్రి కూతుర్ని చదివిస్తోంది. ఆ వృద్ధురాలు బకాయిల్ని ఎలా చెల్లించగలదు. 
– మల్లెల రఘుపతి, జంగారెడ్డిగూడెం
 
మరిన్ని వార్తలు