2న పల్స్‌పోలియో

25 Mar, 2017 23:48 IST|Sakshi

అనంతపురం మెడికల్‌ : పక్కా ప్రణాళిక రూపొందించుకుని ఏప్రిల్‌ 2న నిర్వహించే పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిలా​ వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్‌ వెంకటరమణ సూచించారు. శనివారం పల్స్‌ పోలియోకు సంబంధించి వైద్యాధికారులతో డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, పీపీ యూనిట్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యులకు ఆయన సూచనలు చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలన్నారు. వేసవి నేపథ్యంలో వ్యాక్సిన్‌ శీతలీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్‌ 7 నుంచి 14 వరకు డీపీటీ క్యాంపెయిన్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం వడదెబ్బ తగిలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆస్పత్రులతో పాటు ఉపాధి పనులు జరిగే ప్రాంతాల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అంతకుముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ కర్నూలు విభాగం సర్వెలైన్స్‌ వైద్యాధికారి పవన్‌కుమార్‌ వైద్యులకు పలు సూచనలు చేశారు. పోలియో కార్యక్రమం నిర్వహణ, నివేదికలు పంపే తీరును వివరించారు. కార్యక్రమంలో డీటీసీఓ సుధీర్‌బాబు, డీఐఓ పురుషోత్తం, డీపీఎంఓ అనిల్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ యుగంధర్, డెమో హరిలీలాకుమార్, ఎస్‌ఓ మారుతిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు