కండక్టర్ల కస్సు‘బస్సు’

3 Nov, 2015 02:49 IST|Sakshi
కండక్టర్ల కస్సు‘బస్సు’

- ఆంధ్ర- తెలంగాణల మధ్య చార్జీల చిచ్చు
- ఏపీఎస్ ఆర్టీసీ  చార్జీల పెంపు..
- తెలంగాణ బస్సుల వైపు ప్రయాణికుల మొగ్గు

 
సాక్షి, హైదరాబాద్: అది విజయవాడ బస్టాండ్.. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్లాట్‌ఫారం వద్దకు వస్తోంది. వెంటనే ఏపీఎస్ ఆర్టీసీ కండక్టర్లు వచ్చి దానిని అడ్డుకున్నారు. రెండు ఏపీ బస్సులు బయలుదేరాకే ఫ్లాట్‌ఫారం వద్దకు రావాలని ఆర్డర్ వేశారు. రోజూ నిలిపే సమయమే కదా అడ్డుకోవడమేంటని టీఎస్ ఆర్టీసీ కండక్టర్ ప్రశ్నించారు. ‘మీ బస్సు వస్తే ప్రయాణికులు ఎగబడి ఎక్కేస్తారు, మా బస్సుల  ప్రయాణికుల సంఖ్య పడిపోతుంది.’ అంటూ ఏపీ కండక్టర్లు ఎదురుదాడికి దిగారు. ఇది ఒక్క విజయవాడలోనే కాదు. ఏపీలోని పలు ప్రధాన బస్టాండ్లలో ఏపీ, తెలంగాణ కండక్టర్లు కస్సుబుస్సులాడుకుంటున్నారు.
 
 ఇదీ సంగతి...
 ఇటీవల ఏపీఎస్ ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచింది. కానీ, తెలంగాణ ఆర్టీసీ చార్జీలు యధాతథంగా ఉన్నాయి. విజయవాడ-హైదరాబాద్ మధ్య ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ బస్సు టికెట్ ధరల్లో భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఏపీ-తెలంగాణ మధ్య ప్రయాణించే అన్ని రూట్లల్లోనూ ఇదే తీరు. దీంతో ప్రయాణికులు తెలంగాణ బస్సులు ఎక్కేందుకే ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ బస్సు నడిచే సమయానికి ముందు- వెనక తిరిగే ఏపీ బస్సుల్లో కొన్ని సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇది ఆక్యుపెన్సీ రేషియోపై ప్రభావం చూపుతోంది. దీంతో కీలక వేళల్లో తెలంగాణ బస్సులను ప్లాట్‌ఫాం వద్దకు రాకుండా కొన్నిచోట్ల ఏపీ కండక్టర్లు అడ్డుకుంటున్నారు. దీంతో గత్యంతరం లేక వెనక నిలుపుతున్న తెలంగాణ బస్సు కండక్టర్లు ప్లాట్‌ఫాం వద్దకు వెళ్లి..‘తెలంగాణ బస్సు వెనక ఉంది... వచ్చి కూర్చోండి... టికెట్ ధర కూడా తక్కువ’ అంటూ కేకలు వేస్తూ ప్రయాణికులను ఆహ్వానిస్తున్నారు.
 
దీంతో ఏపీ ఆర్టీసీ కండక్టర్లు వారితో వాదనకు దిగుతున్నారు.  ఒకే రూట్‌లో ప్రయాణించే వేర్వేరు రాష్ట్రాల బస్సుచార్జీలు ఒకేలా ఉంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావని, తెలంగాణలో కూడా బస్సు చార్జీలు సవరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఏపీ అధికారులు తెలంగాణ అధికారులను కోరుతున్నారు. లేని పక్షంలో అంతర్‌రాష్ట్ర ఒప్పందం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఒప్పందం ఉంటే ఏ ఆర్టీసీ బస్సులోనైనా, ఏ రాష్ట్ర భాగంలో ఆ రాష్ట్ర చార్జీని అమలు చేస్తారు. తెలంగాణ భూభాగంలో రెండు ఆర్టీసీలు తెలంగాణ చార్జీని, ఏపీ భూభాగంలో రెండు ఆర్టీసీ బస్సుల్లో ఏపీ చార్జీలను అమలు చేయాల్సి ఉంటుంది. అయితే, సాంకేతికంగా ఇంకా రెండు ఆర్టీసీలు విడిపోకపోవటం ఈ ఒప్పందానికి అడ్డొస్తోంది.

మరిన్ని వార్తలు