వ్యవస్థలో మార్పులు చేస్తేనే ఆర్టీసీ మనుగడ

30 Jun, 2017 14:56 IST|Sakshi
వ్యవస్థలో మార్పులు చేస్తేనే ఆర్టీసీ మనుగడ

► అధికార, కార్మిక భాగస్వామ్యంతోనే  ప్రగతిబాట
► ఎన్‌ఎంయూ రాష్ట్ర చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ధనుంజయరెడ్డి


నెల్లూరు(బృందావనం) : ఆర్టీసీలో అధికారులు పాత విధానాలకు స్వస్తి పలికి, వ్యవస్థలో మార్పులు తెచ్చి కార్మికులను భాగస్వామ్యం చేస్తేనే సంస్థ మనుగడ సాగిస్తుందని ఎన్‌ఎంయూ రాష్ట్ర చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కొడవలూరు ధనుంజయరెడ్డి అన్నారు. నెల్లూరులోని పురమందిరంలో గురువారం జరిగిన ఏపీఎస్‌ఆర్టీసీ నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ నెల్లూరు రీజియన్‌ 10వ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్టీసీ ప్రగతిచక్రంలో పయనించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయన్నారు.

అయితే ప్రభుత్వ యంత్రాంగం సుమారు 70 ఏళ్లనాటి విధానాలనే అమలుపరుస్తోందన్నారు. ఈ కారణంగా ఆర్టీసీ మనుగడ రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్టీసీ లాభాలబాటలో పయనించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయన్నారు. ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం ఆలోచన చేయాలన్నారు. ఆర్టీసీని ప్రైవేట్‌ పరంచేసే ఆలోచన విరమించుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్‌ ఆర్‌వీవీఎస్‌డీ ప్రసాద్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లాచంద్రయ్య,  వై.శ్రీనివాసరావు, రాష్ట్రకార్యనిర్వాహక అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి,  నెల్లూరు రీజియన్‌ నాన్‌ ఆపరేషన్‌ గౌరవాధ్యక్షుడు గాదిరాజు అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొని మాట్లాడారు.

మరిన్ని వార్తలు