పేద విద్యార్థులకు విద్యను దూరం చేయొద్దు

24 May, 2016 12:39 IST|Sakshi

నిడదవోలు: పేద, బడుగు, బలహీన వర్గాల బాల బాలికలకు విద్యను దూరం చేయరాదని, రేషనలైజేషన్ పేరుతో పాఠశాలలను మూసివేసే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని ఏపీ టీచర్స్ ఫెడరేషన్, (ఏపీటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి ఐ.రాజగోపాల్ డిమాండ్ చేశారు. స్థానిక ఎన్టీఆర్ మునిసిపల్ హైస్కూల్‌లో సోమవారం జరిగిన నిడదవోలు జోనల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు.

విద్యార్ధులు తక్కువగా ఉన్నారని రాష్ట్ర వ్యాప్తంగా 5,916 ప్రాథమిక పాఠశాలలు, 5,475 ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రభుత్వం మూసివేయడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు. గతేడాది 1,500 ప్రాథమిక పాఠశాలలను మూసివేశారన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని సూచిస్తుందన్నారు. ప్రస్తుతం భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ పోస్టులు 19,480 ఉన్నాయని తెలిపారు. జిల్లా ప్రధానకార్యదర్శి బీఏ సాల్మన్‌రాజు మాట్లాడుతూ మునిసిపల్ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్‌ను రూపొందించాలని, జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.రవికుమార్, కారింకి శ్రీనివాస్, పీవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు