రైతులకు ‘పీత’ కష్టాలు

21 Jan, 2016 10:18 IST|Sakshi
రైతులకు ‘పీత’ కష్టాలు

రాష్ట్రంలో లభించని పిల్ల పీతలు
తమిళనాడులోని ఆర్‌జీసీఏ చుట్టూ ప్రదక్షిణలు
చిన్న, సన్నకారు రైతులకు శిక్షణ కరువు
సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సీఎం ఆదేశం

 
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతాల్లోని పీతల సాగు రైతులు ‘సీడ్’ (పిల్ల పీతలు) కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో సాగుకు అనువైన సీడ్ లభించకపోవడంతో త మిళనాడులోని నాగపట్నం సమీపంలో ఉన్న రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ ఆక్వా (ఆర్‌జీసీఏ)కు పరుగులు తీస్తున్నారు. నాలుగు వారాలు తిరిగినా మేలురకం సీడ్ దొరక్క తిరుగుముఖం పడుతున్నారు. ఆక్వా రైతుల సమస్యపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఇటీవల రాష్ట్ర మత్స్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
 
ఏపీలో సాగయ్యే పీతలకు విదేశాల్లో డిమాండ్
సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న ఆక్వా రైతులు చేపలు, రొయ్యలతోపాటు పీతల సాగుపై కూడా ఆసక్తి చూపుతున్నారు. సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా వంటి దేశాల్లో మేలురకం పీతలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లో సాగయ్యే పీతలకు అక్కడ మంచి ఆదరణ లభిస్తోంది. కిలో పీతలను రూ.1,000 నుంచి రూ.1,200కు కొనుగోలు చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని నరసాపురం, భీమవరం, మొగల్తూరు, రాజోలు, అంతర్వేది, కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను, మచిలీపట్నం, చల్లపల్లి, కైకలూరు, విజయనగరం జిల్లా పూసపాటిరేగ, శ్రీకాకుళం జిల్లాలోని సముద్రతీర మండలాల్లో పీతల సాగుపై రైతులు దృష్టి సారించారు.

సరైన సీడ్ కోసం రెండు నెలలుగా వెతుకుతున్నారు. పీతల సాగులో మేలైనవిగా పేర్కొనే సిల్లా వలేషియా, సిల్లా సెరిటా రకం పిల్ల పీతలను కొనుగోలు చేసి చెరువుల్లో పెంచాల్సి ఉంటుంది. అయితే, ఈ రకం సీడ్ రాష్ట్రంలో ఎక్కడా దొరకడం లేదు. దీంతో తమిళనాడులోని ఆర్‌జీసీఏను ఆశ్ర యిస్తున్నారు. ఆ కేంద్రం నిర్వాహకులేమో నెలల తరబడి తిప్పుకుంటూ సీడ్‌ను మాత్రం అందజేయడం లేదు. దీంతో అదను దాటుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
ఆర్‌జీసీఏ ఉప కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి
పీతలు సాగుచేసే రైతులకు రాష్ట్రంలో సరైన శిక్షణ కరువైంది. పెద్ద చెరువులున్న బడా రైతులు ఇతర రాష్ట్రాల్లో మెలకువలు నేర్చుకొని వస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు మాత్రం సాగులో సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. ఏ ప్రాంతాల్లో ఏ రకం పీతల సాగు అనుకూలం? సీడ్‌ను ఎలా తెచ్చుకోవాలి? సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? అనే అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కరువైంది. ఇటీవల పలువురు రైతులు తమ సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

రైతుల సమస్యలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన మత్స్యశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. 10 వేల హెక్టార్లలో సాగుకు అవసరమైన పిల్లపీతలను సూర్యలంక, తాళ్లపాలెం ప్రాంతాల్లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ నాయక్ చెప్పారు. ఆర్‌జీసీఏ ఉప కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేయించాలని ఆక్వా రంగ ప్రముఖులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు