ఆక్వా ల్యాబ్‌లకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

12 Oct, 2016 21:59 IST|Sakshi
ఆక్వా ల్యాబ్‌లకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి
కైకలూరు : జిల్లాలో ప్రయివేటు ఆక్వా ల్యాబ్‌లు తప్పనిసరిగా మత్స్యశాఖ వద్ద రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని మత్స్య శాఖ జిల్లా సహాయ సంచాలకుడు పి.కోటేశ్వరరావు చెప్పారు. కైకలూరులోని మత్స్యశాఖ కార్యాలయానికి ఆయన బుధవారం వచ్చారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నంబరు 49 ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రయివేటు ల్యాబ్‌లను ఒకే గొడుకు కిందకు తీసుకువస్తుందన్నారు. జిల్లాలో 30 ప్రయివేటు ఆక్వా ల్యాబ్‌లు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. సీపా, ఎంపెడా వంటి సంస్థల ద్వారా కాకినాడ, కైకలూరు ప్రాంతాల్లో ప్రయివేటు ల్యాబ్‌ టెక్నీషియన్లకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. జిల్లాలో 48వేల హెక్టార్లలో మంచినీటి చెరువులు, 15 వేల హెక్టార్లులో ఉప్పునీటి చెరువులు ఉన్నాయని వివరించారు. ఇప్పటి వరకు మంచినీటి చెరువులు 25 వేలు, ఉప్పునీటి చెరువులు 3వేల వరకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలిపారు. చెరువుల అనుమతులకు సంబంధించి ఆటో క్యాడ్‌లు జతచేయని కారణంగా 433 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. చెరువులను ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేని చేపల రైతులకు డిసెంబరు 31వ తేదీలోపు రూ.500, 2017 మార్చి 31వ తేదీలోపు అయితే రూ.700 అపరాధ రుసుంతో దరఖాస్తులు అందించాలని చెప్పారు. 
సబ్సిడీపై పరికరాలు.. 
మత్స్యశాఖ పాలసీలో భాగంగా ఆక్వా రైతులకు సబ్సిడీపై పరికరాలను అందిస్తున్నట్లు కోటేశ్వరరావు చెప్పారు. జిల్లాలో ఐదు ఎకరాలలోపు రొయ్యల రైతులకు 50శాతం సబ్సిడీపై ఒక్కో రైతుకు 4 ఎరియేటర్లు చొప్పున 150 మందకి అందించామన్నారు. ఎస్సీ, ఎస్టీ ఆక్వా రైతులకు ఫిష్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ కోసం   రూ.7 కోట్లు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, బీసీలకు 50 శాతం సబ్సిడీపై చేపల వలలను అందిస్తున్నట్లు వివరించారు. వేటకు ఉపయోగించే ఐబీఎం ఇంజిన్‌ రూ.1.20లక్షలకు 60 శాతం సబ్సిడీతో మత్స్యకారులకు అందజేస్తున్నట్లు చెప్పారు. కైకలూరు మత్స్యశాఖ ల్యాబ్‌ను త్వరలోనే అప్‌ గ్రేడ్‌ చేసి పూర్తిస్థాయిలో ఆధునికీకరిస్తామని ఆయన తెలిపారు. మత్స్య శాఖ కైకలూరు ఏడీ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.  
 
 
 
>
మరిన్ని వార్తలు