గుండెచెరువు

4 Jul, 2017 02:55 IST|Sakshi
గుండెచెరువు

వరిని మింగేస్తున్న ఆక్వా
పడిపోతున్న వరి సాగు విస్తీర్ణం
అంతా చెరువుల మయం
ఆక్వాకు అధికారపార్టీ వత్తాసు
నిబంధనలకు తూట్లు
అధికారుల చర్యలకు ప్రజాప్రతినిధుల మోకాలడ్డు
ఆహార భద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదం
రైతు సంఘాల ఆందోళన


జిల్లాకు గుండెలాంటి గోదావరి డెల్టా.. ఆంధ్రప్రదేశ్‌ ధాన్యాగారంగా పేరొందింది. ప్రస్తుతం దైన్యాగారంగా మారింది. నానాటికీ వరి విస్తీర్ణం తగ్గిపోతోంది. ఆక్వా సాగు పెరుగుతోంది.  నిబంధనలకు నీళ్లొదిలి అక్రమార్కులు చెరువులు తవ్వేస్తున్నారు. వారికి అధికారపార్టీ నేతలు వత్తా సు పలుకుతున్నారు.

ఏలూరు (మెట్రో) : ‘అనుమతులు లేని చేపల, రొయ్యల చెరువులను ధ్వంసం చేయండి. అక్రమంగా అనుమతులు ఇస్తే మత్స్యశాఖ అధికారులపై చర్యలు తప్పవు. ఉద్యోగాల నుంచి తొలగించేందుకూ వెనుకాడను’ ఇదీ గత వారం కలెక్టరేట్‌లో నిర్వహించిన చేపల చెరువుల అనుమతుల  కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ పలికిన మాటలు.. అయితే వాస్తవ పరిస్థితులు దీనికి విరుద్ధంగా ఉన్నాయి.  

ప్రజాప్రతినిధుల అండ
అడ్డదిడ్డంగా ఆక్వా చెరువుల తవ్వకానికి అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు వత్తాసు పలుకుతున్నారు. నిబంధనలు పాటించని అక్రమార్కులపై అధికారులు చర్యలకు ఉపక్రమిస్తుంటే వారు అడ్డుతగులుతున్నారు. అధికారులపై దూషణల పర్వానికీ పూనుకుంటున్నారు. ‘ప్రభుత్వం మాదే.. అనుమతులు ఇవ్వకుంటే అంతు చూస్తాం’ అంటూ బెదిరిస్తున్నారు.  ఫలితంగా ఏమీ చేయలేని దయనీయ స్థితిలో అధికారులు ఉండిపోతున్నారు. ఉండి, భీమవరం, ఉంగుటూరు నియోజకవర్గాలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది.

ఇవిగో.. ఉదాహరణలు..
ఉండి నియోజవకర్గం ఆకివీడు మండలంలో ఇటీవల మండల స్థాయి టీడీపీ కార్యకర్తలు, అధికారులతో ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధి సమావేశాన్ని ఏర్పాటు చేసి.. చేపల చెరువుల అనుమతులు ఎందుకు రద్దుచేశారంటూ అధికారులను మందలించారు. కార్యకర్తల ముందే నిలబెట్టి దూషణలకు దిగారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ నేత నిడమర్రు మండలంలో చెరువుల అనుమతులపై మండల స్థాయి అధికారులపై విరుచుకుపడ్డారు.  భీమవరానికి మంచినీటిని సరఫరా చేసే వేండ్ర మార్గంలో తాగునీటి చెరువు సమీపంలో చేపల చెరువులు తవ్వుతున్నారని నిలిపేందుకు యత్నించిన అధికారులకు అక్కడి ప్రజాప్రతినిధి నుంచి చివాట్లు ఎదురయ్యాయి.దీంతో అధికారులు నలిగిపోతున్నారు. చెరువులకు అనుమతులు ఇవ్వకుంటే.. ప్రజాప్రతినిధులు, ఇస్తే కలెక్టర్‌ తమపై విరుచుకుపడుతుండడంతో ఏమి చేయాలో పాలుపోక తీవ్ర వేదన అనుభవిస్తున్నారు. ఇలా అయితే ఉద్యోగాలు ఎలా చేయాలని మదన పడుతున్నారు.  

నాయకులే చెరువుల దళారులు
చేపల చెరువులకు మండల స్థాయి నుంచి, జిల్లాస్థాయి వరకూ అనుమతులు తీసుకొచ్చేందుకు టీడీపీ నేతలే దళారులుగా మారారు. వీరు గతంలో ఎకరా చెరువు అనుమతికి రూ.25వేలు వసూలు చేసేవారు. ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా అనుమతులిప్పించేందుకు తమ కమీషన్‌ను తగ్గించుకున్నారు. ప్రస్తుతం రూ.15వేలకు అన్నిరకాల అనుమతులూ తీసుకొస్తామని రైతుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారు.  

నిబంధనలకు పాతర..
మాగాణి భూములను చేపలు, రొయ్యలు చెరువులుగా మార్చాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. వీటిని కచ్చితంగా అమలు చేయాల్సిందే. అయితే అక్రమార్కులు, దళారులు వీటిని పట్టించుకోవడం లేదు. అక్రమ మార్గాల్లో అనుమతులు తెచ్చుకుని చెరువులు తవ్వేస్తున్నారు. కొందరు అనుమతులు లేకుండానే అనధికార సాగుచేపట్టేస్తున్నారు.

నిబంధనలు ఇవి..
వరి, ఇతర పంటలకు పనికిరాని భూములను మాత్రమే చేపల చెరువులుగా మార్చాలి.తమ భూములకు సాగునీటి వసతి లేదని, పంటలకు పనికి రావని ధ్రువీకరించే ఆధారం చూపించాలి.పంట, కాలువలు, డ్రెయిన్లకు దగ్గరలో చెరువులు తవ్వకూడదు. ఉప్పునీటి రొయ్యల సాగుకు అనుమతి లేదు.   నిర్దేశించిన ఆరు రకాల చేపలను మాత్రమే పెంచాలి.అయితే ఈ నిబంధనలేమీ అక్రమార్కులకు పట్టడం లేదు. 

అక్రమ చెరువులపై ఫిర్యాదుల వెల్లువ
ఇదిలా ఉంటే జిల్లాలో అక్రమంగా తవ్విన చెరువులపై కలెక్టరేట్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రతివారం మీకోసం, డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాలకు సుమారు 20 నుంచి 50 ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో కలెక్టర్‌ అక్రమంగా తవ్విన చెరువులపై దృష్టిపెట్టారు. మండల స్థాయి అధికారులకు దీనిపై ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే నియోజకవర్గాల్లో అధికారపార్టీ నేతల వల్ల చెరువుల తవ్వకాల నియంత్రణ అధికారులకు సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ మరింతగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.  

ఇప్పటికైనా కళ్లు తెరవాలి!
ఇప్పటికైనా జిల్లా అధికారులు కళ్లు తెరవాల్సిన అవసరం ఉందని రైతు సంఘాలు చెబుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వరి మాయమవుతుందని, ఆహారభద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మత్స్యశాఖ ఆధ్వర్యంలో అధికారులు వరి ప్రాధాన్యం, ఆక్వా చెరువుల వల్ల కలిగే అనర్థాలపై సదస్సులు నిర్వహించారు. ఇప్పటికైనా నష్టనివారణ చర్యలు చేపట్టాలని, అప్పుడే వరిసాగు వర్థిల్లుతుందని రైతు సంఘాలు, పర్యావరణ ప్రేమికులు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు