కొలువే లక్ష్యంగా..

6 Oct, 2016 23:42 IST|Sakshi
కొలువే లక్ష్యంగా..
  • రెండోరోజు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ 
  • ర్యాలీకి 2771 హాజరు..
  • మెడికల్‌ టెస్ట్‌కు 567 మంది ఎంపిక 
  • బోట్‌క్లబ్‌(కాకినాడ) :
    స్థానిక జిల్లా క్రీడా మైదానంలో గురువారం  కూడా ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ కొనసాగింది. ఆరు జిల్లాల నుంచి 2771 మంది పాల్గొనగా.. కేవలం 567 మంది మాత్రమే మెడికల్‌ టెస్ట్‌కు ఎంపికయ్యారు. పరుగుపందెంలోని చాలా మంది అభ్యర్థులు డీలాపడ్డారు. పరుగు పందెంలో సత్తా చాటిన అభ్యర్థులకు జిగ్‌జాగ్, లాంగ్‌జంప్, పులప్స్, షాట్‌పుట్‌ పరీక్షలు నిర్వహించారు. వీటిలో విజయం సాధించిన అభ్యర్థులకు ఎత్తు, బరువు పరీక్షలు నిర్వహించారు.
     
    శిక్షణ లేకుండా రావడంతో అవస్థలు
    కొందరు అభ్యర్థులు ఎటువంటి శిక్షణ తీసుకోకుండా నేరుగా ర్యాలీ పాల్గొని అవస్థలు పడ్డారు. క్రీడా మైదానంలో 1600 మీటర్లు పరుగుపందెంలో పరుగెత్త లేక మధ్యలో కుప్పకూలారు. 1600 మీటర్ల పరుగును ఆరునిమిషాల్లో పూర్తి చేసిన వారికి బోనస్‌ పాయింట్స్‌ ఇస్తున్నారు. దీంతో కొందరు అభ్యర్థులు వేగంగా పరుగుపెట్టి ఇబ్బందులు పడ్డారు. గమ్యం చేరకుండానే డీలాపడ్డారు. ఆరునిమిషాల్లోపు గమ్యం చేరిన వారికి ఆర్మీ అధికారులు సిరాతో చెస్ట్‌పై మార్కు వేస్తున్నారు.
     
    వర్షంతో అవస్థలు
    వివిధ జిల్లాల నుంచి శుక్రవారం జరిగే ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన అభ్యర్థులు గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో అవస్థలు పడ్డారు. ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులకు స్థానిక శ్రీరామ్‌నగర్‌ మున్సిపల్‌ స్కూల్‌ సదుపాయాలు కల్పించినా, క్రీడా మైదానం సమీపంలోనే అభ్యర్థులు సేదతీరుతున్నారు. ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులు తెల్లవారుజామున హాజరుకావాల్సి రావడంతో స్కూల్‌కు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. దీంతో ఎన్‌ఎఫ్‌సీఎల్‌æరోడ్డులోని పలు జిల్లా కార్యాలయాలు, క్రీడామైదానం బయట ఉన్న దుకాణ సముదాయం వద్ద, పుట్‌పాత్‌లపైన నిద్రిస్తున్నారు.
     
>
మరిన్ని వార్తలు