కోటి 40 లక్షల మందికి ఏర్పాట్లు

26 Jul, 2016 23:47 IST|Sakshi
మట్టపల్లి (మఠంపల్లి) : కృష్ణా పుష్కరాల్లో జిల్లా వ్యాప్తంగా కోటి 40 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు వీలుగా స్నాన ఘాట్లు నిర్మిస్తున్న ఐబీ చీఫ్‌ ఇంజినీర్‌ సిరివోలు సునీల్‌ తెలిపారు. మంగళవారం ఆయన మట్టపల్లి వద్ద కృష్ణానదిలో రూ.4 కోట్లతో నిర్మిస్తున్న బాలాజీ, ప్రహ్లాద హైలెవల్‌ వంతెన కుడి, ఎడమ ఘాట్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ 2004 పుష్కరాల్లో జిల్లా వ్యాప్తంగా 0.55 కిలో మీటర్ల పొడవునా ఘాట్లు నిర్మించగా సుమారు 40 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారన్నారు. అయితే ఈ సారి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తున్నందున సుమారు కోటి 40 లక్షల మంది పుణ్య స్నానాలు చేసేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని మట్టపల్లి, మేళ్లచెరువు, వాడపల్లి, సాగర్, చందంపేట మండలాల పరిధిలో 2.6 కిలోమీటర్ల పొడవున 28 ఘాట్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. పుష్కర ఘాట్ల నిర్మాణం ఇప్పటి వరకు 95 శాతం పూర్తయిందని, వచ్చే నెల 5వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో నిర్మాణాలు పూర్తి రంగులు వేసి ప్రారంభానికి సిద్ధం చేస్తామన్నారు. ఆయన వెంట ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరు మట్టపల్లి రావు, ఐబీ ఎస్‌ఈ ధర్మానాయక్, ఈఈ సంజీవరెడ్డి, డీఈ స్వామి, ఏఈలు పిచ్చయ్య, భిక్షం, ఈఓ ఎం.పి లక్ష్మణరావు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు