తక్షణమే ఆర్కేను కోర్టులో హాజరు పర్చాలి

2 Nov, 2016 20:36 IST|Sakshi
తక్షణమే ఆర్కేను కోర్టులో హాజరు పర్చాలి
కర్నూలు: ఏఓబీ ఎన్కౌంటర్‌లో పోలీసులు మావోయిస్టు అగ్రనేత రామకష్ణ(ఆర్‌కే)ను అదుపులోకి తీసుకొని ఉంటే తక్షణమే కోర్టులో హాజరు పరచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నంద్యాల పట్టణంలోని సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో సరస్వతి నగర్‌లో బుధవారం చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో ఎన్కౌంటర్‌ జరిగితే ఆంధ్రా డీజీపీనే మాట్లాడుతున్నారు తప్ప ఒరిస్సా పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 
 
ఎన్ కౌంటర్ బూటకమని, కాల్పుల్లో 32 మంది చనిపోతే అందులో ఆర్‌కే లేడని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పోలీసుల అదుపులో ఉంటే ఆయనను త్వరగా బయటకు తెచ్చి కోర్టులో హాజరు పర్చాలన్నారు. మావోలు అడవుల్లో ఉంటూ ప్రాణాలు కోల్పోరాదని, వామపక్ష పార్టీల నాయకులతో కలసి పోరాడాలన్నారు. మావోయిస్టులు అందరూ జనజీవన స్రవంతిలో కలసి ప్రజాసమస్యల పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతికి ఈనెల 15న విజయవాడలో అన్ని సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని వార్తలు