15 మంది తమిళకూలీల అరెస్ట్‌

30 Oct, 2016 01:01 IST|Sakshi
15 మంది తమిళకూలీల అరెస్ట్‌

బద్వేలు అర్బన్‌: లంకమల అభయారణ్యంలోని కంచెర్ల కోన వద్ద శనివారం తెల్లవారుజామున 15 మంది తమిళ కూలీలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు బద్వేలు ఫారెస్ట్‌ రేంజర్‌ ఆఫీసర్‌ డిఎస్‌.సుదర్శన్‌ తెలిపారు. స్థానిక ఫారెస్ట్‌ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. లంకమల అభయారణ్యంలోకి తమిళ కూలీలు ప్రవేశించారన్న సమాచారం రావడంతో తనతోపాటు ఇతర సిబ్బంది అటవీప్రాంతంలోకి వెళ్లగా.. కంచెర్ల కోన వద్ద వంట చేస్తూ తారస పడ్డారని తెలిపారు. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయేందుకు యత్నించారని చెప్పారు. వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి మూడుగొడ్డళ్లు, వంట సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అందరూ తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు, తిరువన్నామలై, కృష్ణగిరి జిల్లాలలోని పెరుంబల్లి, డేగరకుప్పం, నడుకుప్ప, తిరుపత్తార్, చంగం, వెలుచునూరు గ్రామాలకు చెందిన వారని వివరించారు. ఈ దాడులలో ఎఫ్‌ఎస్‌ఓ రమణ, ఎఫ్‌బివోలు జాకీర్‌ అహ్మద్, రవి, కరుణాకర్, మునెయ్య, సుదర్శన్, బాషా, ఏబీఓలు సురేష్, బ్రహ్మయ్యతోపాటు వివిధ బీట్‌ల ప్రొటక్షన్‌ వాచర్లు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు