ఇద్దరు చైన్‌స్నాచర్లు అరెస్టు​

18 Mar, 2017 23:45 IST|Sakshi
ఇద్దరు చైన్‌స్నాచర్లు అరెస్టు​

 కడప అర్బన్‌ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో 2014 నుంచి ఈ ఏడాది జనవరి నెల వరకు కడప నగరంతోపాటు వివిధ ప్రాంతాల్లో మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లిన ఇద్దరు చైన్‌ స్నాచర్లను అరెస్టు చేసినట్లు కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌ తెలిపారు. శనివారం సాయంత్రం కడప డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన డి.శ్రీనివాసులురెడ్డి, కుంటుమల్ల మంజునాథరావులు 2014 నుంచి ఈ ఏడాది జనవరి చివరి వరకు తొమ్మిది కేసుల్లో బంగారు చైన్‌ల దోపిడీలకు పాల్పడ్డారన్నారు. వీరి వద్ద నుంచి 227 గ్రాముల బంగారు ఆభరణాలను, రెండు సెల్‌ఫోన్లు, రెండు కత్తులు, మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు.
– 2014లో పెండ్లిమర్రి మండలం మియన్నగారిపల్లె బస్టాప్‌ వద్ద..
– 2015లో ఎర్రగుంట్ల టౌన్‌ వేంపల్లెరోడ్డులో భార్యాభర్తలు వెళుతున్న టీవీఎస్‌ను అడ్డగించి..
– అదే ఏడాది నవంబరులో ముద్దనూరు ఎంపీడీఓ ఆఫీసు సమీపంలో ఓ మహిళ నడుచుకుంటూ వెళుతుండగా..
– 2016 మార్చిలో పెండ్లిమర్రి మండలం పొలతల శివరాత్రి తిరునాల సందర్భంగా ఆర్టీసీ బస్టాప్‌ వద్ద ..
– అదే ఏడాది జూన్‌లో కమలాపురం పట్టణంలోని ప్రగతి స్కూలు సమీపంలో..
– అదే నెలలో కడప శాస్త్రినగర్‌లో..
– అదే ఏడాది ఆగస్టులో ఎర్రగుంట్ల మండలం ఇల్లూరు రైల్వేగేటు వద్ద ఓ మహిళ పొలం పనులకు వెళుతుండగా..
– ఈ ఏడాది జనవరి 7న వల్లూరు మండలం అంబవరం, తాడిగొట్ల రోడ్డులో ఓ యువతి, యువకుడు మోటారు సైకిల్‌లో వెళుతుండగా..
– అదే ప్రాంతంలో ఈ ఏడాది జనవరి 7న మోటారు సైకిల్‌పై వెళుతున్న యువతీయువకులను బెదిరించి వీరు బంగారు గొలుసులను లాక్కెళ్లారని వివరించారు.  నిందితులు వైవీయూ సమీపంలో ఎగువ పల్లె క్రాస్‌ వద్ద మోటారు సైకిల్‌తోపాటు ఉండగా వారిని అరెస్టు చేశామన్నారు. వారి వద్దనుంచి దాదాపు రూ. 6 లక్షల విలువైన 227 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు సెల్‌ఫోన్లను, రెండు కత్తులను, మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిని అరెస్టు చేయడంలో కృషి చేసిన కడప రూరల్‌ సీఐ బి.వెంకట శివారెడ్డి, వల్లూరు ఎస్‌ఐ ఎం.భాస్కర్‌రెడ్డి, కడప తాలూకా హెడ్‌ కానిస్టేబుల్‌ పి.మురళీ కృష్ణ, వల్లూరు కానిస్టేబుల్‌ ఎస్‌ఎండీ హుసేన్, పెండ్లిమర్రి కానిస్టేబుల్‌ రాంబాబు, చింతకొమ్మదిన్నె కానిస్టేబుల్‌ చంద్రమోహన్‌రెడ్డి, హోం గార్డులు లక్ష్మిరెడ్డి, జనార్దన్‌లను డీఎస్పీ అభినందించారు.

 

మరిన్ని వార్తలు