పాటే ప్రాణం!

23 May, 2017 17:26 IST|Sakshi

► కళాకారుడిగా రాణిస్తున్న చరణ్‌
►ప్రభుత్వ గుర్తింపునివ్వడంలో వివక్ష
►రాష్ట్రం, జిల్లా సాధన, హక్కుల సాధన కోసం వందలాది ప్రదర్శనలు
►ప్రముఖులచే ప్రశంసలు


గద్వాల అర్బన్: ధరూర్‌ మండలం నీలహాళ్లి గ్రామానికి చెందిన చరణ్‌కు పాటంటే ప్రాణం. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి గాయకుడిగా, రచయితగా, డ్యాన్సర్‌గా రాణిస్తున్నాడు. ఎమ్మార్పీఎస్‌ వర్గీకరణ పోరాటంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో, సకలజనుల సమ్మెలో తన పాట, ఆటలతో ఆకట్టుకున్నాడు. అలాగే గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయాలని నడిగడ్డలో ఎగసిన ఉవ్వెత్తు ఉద్యమంలోనూ తనవంతు పాత్రను పోషించాడు. ఎక్కడ ప్రదర్శనలు చేసినా తన ఆటపాటలతో ప్రజలను ఉర్రూతలూగించాడు.

అమ్మ తొలిగురువు
తల్లిదండ్రులకు నలుగురు సంతానం, చివరి వాడు చరణ్‌. నిరుపేద దళిత కుటుంబం కావడంతో ఉప్పేరు హాస్టల్‌లో టె¯ŒS్త వరకు చదివించారు. ఆపై చదువులు చదివించలేకపోవడంతో తల్లితో పాటు వ్యవసాయ పనులకు వెళ్లేవాడు. అక్కడ తల్లిపాడే జానపద గేయాలు, బొడ్డెమ్మ పాటలకు కోరస్‌గా పాడేవాడు. అప్పుడే పాటపై ఇష్టం ఏర్పడింది. రాత్రివేళ కాలనీలో కోలాటం వేసేవారు. అందులో తండ్రి జంగిలప్ప ద్వారా కోలాటం నేర్చుకున్నాడు.

జిల్లా ఉద్యమంలో...
నూతన ఏర్పాటులో మొదట గద్వాల పేరు లేకపోవడంతో ఇక్కడ ప్రజలు జిల్లా కోసం అనేక నిరసనలు చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు, జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షల్లో చరణ్‌ తన గళంవిప్పాడు. జిల్లా ప్రాశ్సస్త్యం, ప్రాముఖ్యతపై పాటలు రాసి పాడాడు. జిల్లా సాధించుకున్న తర్వాత కలెక్టర్‌ రజత్‌కుమార్‌సైనీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సంబురాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులచే శభాష్‌ అనిపించుకున్నాడు. 2015లో ఐదు రోజుల పాటు జరిగిన పాలమూరు కళాప్రదర్శన కళాబృందం ప్రదర్శించి అప్పటి కలెక్టర్‌ శ్రీదేవి చేతులమీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళాకారులను ప్రభుత్వ ఉద్యోగులుగా అవకాశం కల్పించారు. కానీ చరణ్‌పై మాత్రం వివక్ష ప్రదర్శించారు.

2001 నుంచి ప్రారంభం...
అప్పటి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పాటలు రాసి స్వయంగా పాడాడు. ప్రభుత్వ కార్యక్రమాలు, మూఢనమ్మకాలపై, అంటరానితనం, దళితుల దేవాలయ ప్రవేశం, పల్లెసుద్దుల తదితర కార్యక్రమాలపై కళాజాతా ప్రదర్శన ఇచ్చాడు. ఎస్సీ వర్గీకరణపై చేపట్టిన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాడు.

తెలంగాణ ఉద్యమ సమయంలో...
2005లో తెలంగాణ ఉద్యమం కేసీఆర్‌ నాయకత్వంలో నడిగడ్డ నుంచే మొట్టమొదటి పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో కేసీఆర్, లక్ష్మారెడ్డి వెంట ధూంధాం కార్యక్రమాలు, ఆటలు పాటలు, డప్పుల ప్రదర్శనలు ఇచ్చారు. పాటల ద్వారా తెలంగాణ ఉద్యమంపై అవగాహన కల్పించారు. తెలంగాణ వస్తే బతుకు మారుతుందని భావించి సకలజనుల సమ్మెలో 42రోజుల పాటు అహర్నిశలు ఆటలు, పాటలు పాడుతూ ధూంధాం నిర్వహించడం జరిగింది. నడిగడ్డ జిల్లాలో చరణ్‌ బృందం పాల్గొనని కార్యక్రమమే లేదు.

నడిగడ్డ కళాకారులపై ప్రభుత్వం వివక్ష
ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా పాటను మాత్రం వదలేదు. 17ఏళ్లుగా... తెలంగాణ ఉద్యమం, జిల్లా సాధనలో, జిల్లా సంబరాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారంలో వందలాది ప్రదర్శనలు ఇచ్చాను. అయినా ప్రభుత్వం నడిగడ్డ కళాకారులను గుర్తించకుండా వివక్ష చూపుతోంది. నాతోపాటు అనేక మంది కళాకారులకు అన్యాయం చేసింది. ఇది నాపై వివక్ష కాదు. కళపై వివక్ష. ఇకనైనా ప్రభుత్వం గుర్తించి సాంస్కృతిక సారథిలో అవకాశం కల్పించాలి.                                                  –చరణ్, కళాకారుడు  
 

మరిన్ని వార్తలు