‘ఆశ’లకు త్వరలో తీపి కబురు!

29 Jul, 2016 00:18 IST|Sakshi
సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌
  • ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌
  •  
    ఖమ్మం వైద్య విభాగం: ‘‘ఆశ వర్కర్లకు త్వరలోనే తీపి కబురు అందుతుంది’’ అని, అధికార పార్టీకి చెందిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు. వైద్య విభాగంలో క్షేత్ర స్థాయిలో ఆశ వర్కర్లు అందిస్తున్న సేవలు మరువలేనివని ఆయన అన్నారు. ఆశ సమ్మేళన సభ గురువారం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగింది. ముఖ్య అతిథిగా అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్య, వైద్య విభాగాలు బాగుంటే ఏ రాష్ట్రమైనా బాగుపడుతుందన్నారు. గ్రామ స్థాయిలో పనిచేస్తున్న ఆశ వర్కర్లను ప్రోత్సహించేందుకు సమ్మేళనం నిర్వహించటం అభినందనీయమన్నారు. మాతాశిశు మరణాలను తగ్గించడంలో ఆశ వర్కర్లు అందిస్తున్న సేవలు అమోఘమని అన్నారు. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనసున్న మారాజు. ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఆయన నుంచి త్వరలోనే తీపి కబురు వింటారు’’ అని చెప్పారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఆశ వర్కర్లు ప్రోత్సాహకం పెంపుపై ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఉత్తమ సేవలందించిన ఆశ వర్కర్లకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఎమ్మెల్యే అజయ్‌ ప్రదానం చేశారు. కార్యక్రమంలో నగర మేయర్‌ డాక్టర పాపాలాల్, పీఓ డీటీటీ అన్న ప్రసన్న, డెమో వెంకన్న, ఎస్‌పీహెచ్‌ఓ డాక్టర్‌ మాలతి, హెచ్‌ఈఓ ప్రసాద్, ఖమ్మం క్లస్టర్‌ పరిధిలోని 13 పీహెచ్‌సీలకు చెందిన ఆశలు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు