అదితి.. అతిథే.!

7 Sep, 2017 10:20 IST|Sakshi
టీడీపీ సర్వసభ్య సమావేశంలో వేదికపై మొదటివరుసలో తల్లిదండ్రులతో పాటు కూర్చున్న అదితి

ఆమె నా రాజకీయ వారసురాలు కాదు
వచ్చే ఎన్నికల్లోతాను పోటీచేయదు
చంద్రబాబుకు వివరణ ఇచ్చుకున్న అశోక్‌
ఇంకెప్పుడూ పార్టీలో తిప్పవద్దన్న సీఎం


సాక్షి ప్రతినిధి, విజయనగరం: అదితి... పూసపాటి వంశానికి వారసురాలు.. కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు పెద్ద కుమార్తె.. ఆయన రాజకీయ వారసురాలిగా 2019 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయాల్సి ఉంది. కొద్ది నెలలుగా జిల్లాలో భారీ ఎత్తున జరుగుతున్న ఈ ప్రచారానికి పెద్ద దెబ్బే తగిలింది. సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రబాబే ఇకపై ఆమెను రాజకీయాల్లో ప్రమోట్‌ చేయెద్దని కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజును ఆదేశించినట్లు తెలిసింది. అమరావతిలో రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ సమావేశానికి హాజరైన అశోక్‌ గజపతిరాజుతో చంద్రబాబు ఏకాంతంగా మాట్లాడారు. బీజేపీలోకి వెళ్లననే స్టేట్‌మెంట్‌ ఇవ్వాల్సిన అవసరంపై వారిమధ్య చర్చ మొదలైంది.

అలాంటి ప్రచారం జరుగుతున్నందున అడ్డుకట్ట వేయడానికి తానలా వ్యాఖ్యానించినట్లు ఆశోక్‌ వివరణ ఇచ్చారు. అయితే కుమార్తెను ఎందుకు ప్రమోట్‌ చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలబెట్టే ఆలోచనేమైనా ఉందా అని సీఎం అడిగారు. అలాంటిదేమీ లేదని, వచ్చే ఎన్నికల్లోనూ తానే పోటీ చేయాలనుకుంటున్నానని అశోక్‌ స్పష్టం చేశారు. అలాంటప్పుడు పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు తిప్పుతున్నారని సీఎం మరోసారి నిలదీశారు. అదితి తన రాజకీయ వారసురాలని ఎక్కడా చెప్పలేదని కేవలం మాన్సాస్‌ను చూసుకోవడం కోసమే ఆమెను బయటకు తీసుకువస్తున్నానని చంద్రబాబుకు సర్దిచెప్పుకున్నారు.

రాజకీయ వారసత్వం ప్రశ్నార్థకం
రాజరికానికి... ప్రజాస్వామ్యానికి సాక్ష్యంగా నిలిచిన సంస్థానం పూసపాటి వంశం. ఈ కుటుంబ రాజరికంలో చివరి పట్టాభిషిక్తుడైన పి.వి.జి.రాజునుంచి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్‌ గజపతిరాజు వరకూ రాజకీయ వారసత్వం కొనసాగుతోంది. అయితే అశోక్‌ తర్వాత ఆయన రాజకీయ వారసులెవరనే చర్చ 2014లోనే మొదలైంది. 2019 ఎన్నికల నాటికి ఆయన పెద్ద కుమార్తె అదితి వారసురాలిగా వస్తోందనే ప్రచారం ఇటీవల ఊపందుకుంది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించకముందు జనతాపార్టీలో శాసన సభ్యుడిగా పనిచేశారు అశోక్‌. టీడీపీ ఆవిర్భావంలోనే ఆ పార్టీలో చేరి నేటికీ అదే పార్టీలో కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసి గెలుపొంది కేంద్రంలో పౌరవిమానయాన శాఖ మంత్రి పదవి చేపట్టారు.

ఇటీవల ఆయన బీజేపీలో చేరబోతున్నారని, అందుకే కుమార్తెను టీడీపీ నుంచి బరిలోకి దించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జిల్లా పార్టీ సర్వసభ్య సమావేశంలో వేదికపై అదితి మొదటి వరుసలో తల్లిదండ్రులతో పాటు కూర్చున్నారు. ఈ విషయాలు చంద్రబాబు దృష్టికి వెళ్లాయి. దీనిపై ప్రత్యేకంగా పిలిచి సీఎం ప్రశ్నించడంతో అశోక్‌ తన వారసత్వం గురించి మాత్రమే కాకుండా తన రాజకీయ భవిష్యత్‌ గురించి కూడా అధినేతకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఇన్నాళ్లూ అదితి వస్తోందని, వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తుందని జరిగిన ప్రచారానికి తెరపడనుంది.

మరిన్ని వార్తలు