టెన్నిస్‌లో ఆశ్రిత ప్రతిభ

5 Oct, 2016 21:42 IST|Sakshi
టెన్నిస్‌లో ఆశ్రిత ప్రతిభ
గుంటూరు స్పోర్ట్స్‌ : ఢిల్లీలోని ఆర్‌.కె.కన్నా టెన్నిస్‌ స్టేడియంలో సెప్టెంబర్‌ 26 నుంచి 30వ తేది వరకు జరిగిన జాతీయ కేంద్రీయ విద్యాలయాల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఏటుకూరు గ్రామానికి చెందిన లేళ్ల ఆశ్రిత ప్రతిభ కనబర్చి టీం ఈవెంట్‌లో రన్నరప్‌ టైటిల్‌ను, సింగిల్స్‌లో తృతీయ స్థానాన్ని సాధించింది. ఆగస్టులో హైదరాబాద్‌లో జరిగిన కె.వి.ఎస్‌ రీజనల్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో టెన్నిస్‌ విభాగంలో ఆశ్రిత బంగారు పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. తల్లిదండ్రులు మధు, సుధాకర్‌ ప్రోత్సహంతో స్థానిక ఎన్టీఆర్‌ టెన్నిస్‌ కోచ్‌ శివప్రసాద్‌ వద్ద టెన్నిస్‌ శిక్షణకు శ్రీకారం చుట్టిన  ఆమె అంచలంచెలుగా జాతీయ స్థాయికి ఎదిగింది. ఆశ్రిత ప్రస్తుతం నల్లపాడులోని కేంద్రీయ విద్యాలయంలో 8వ తరగతి చదువుతోంది. 2015 ఢిల్లీలో జరిగిన జాతీయ కేంద్రీయ విద్యాలయాల టెన్నిస్‌ పోటీలలో టీం ఈవెంట్‌లో రన్నరప్‌ టైటిల్‌ సాధించింది. ఆల్‌ ఇండియా టెన్నిస్‌ అసోసియేషన్‌ నిర్వహించిన ఐటా టెన్నిస్‌ టోర్నమెంట్‌లలో అండర్‌–14 బాలికల విభాగంలో పలు టైటిల్స్‌ సాధించింది. ఆట తీరును మెరుగుపర్చుకోనేందుకు ప్రతిరోజు 4 గంటలు టెన్నిస్‌లో శిక్షణ పొందుతూ ఆటలోని మెలుకవలు నేర్చుకుంటోంది.  జాతీయ స్థాయి రన్నరప్‌ టైటిల్‌ సాధించిన ఆశ్రితను బుధవారం ఎన్టీఆర్‌ స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు, జిల్లా టెన్నిస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కె.చారి తదితరులు అభినందించారు.
మరిన్ని వార్తలు