లిఫ్ట్‌ అడిగాడు.. తనువు చాలించాడు

29 Mar, 2017 01:56 IST|Sakshi
లిఫ్ట్‌ అడిగాడు.. తనువు చాలించాడు
తొర్రూరు రూరల్‌ (మహబూబాబాద్‌) : మరో ప్రాంతానికి వెళ్లేందుకు అటుగా వస్తున్న వాహనదారుడిని లిఫ్ట్‌ అడిగి వెళ్తున్న ఓ బాటసారి ఆ వాహనం బోల్తాపడటంతో దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామశివారులో సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన కాళిదాస శ్రీను (46) లారీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. లారీ భాగాలు తెచ్చేందుకు కరీంనగర్‌కు వెళ్లాడు. అక్కడ లారీ విడి భాగాలు అందుబాటులో లేకపోవడంతో విజయవాడ వెళ్లేందుకు ఉపక్రమించాడు. కరీంనగర్‌ నుంచి ఇనుప లోడుతో విజయవాడు వెళుతున్న బొలెరో వాహనదారుడిని లిఫ్ట్‌ అడిగి ఎక్కాడు.  

కృష్ణా జిల్లా చెవుటూరుకు చెందిన బొలెరో డ్రైవర్‌ చింతకింది రామకృష్ణ నిద్రమత్తులోకి వెళ్లడంతో వాహనం అదుపుతప్పి బండకు ఢీకొనడంతో వాహనం బోల్తా పడింది. వాహనం కింద పడిన శ్రీను ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్‌ ప్రాణాలతో బయటపడి అక్కడి నుంచి పరారయ్యాడు. అదే వాహనంలో వెనుక భాగంలో కూర్చున్న మరో ప్రయాణికుడు శ్రీనివాసరావుకు గాయాలవగా స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనా స్థలాన్ని తొర్రూరు ఏఎస్సై సుదర్శన్‌ పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్‌కు తరలించారు. మృతుడి కుమారుడు కాళిదాస లక్ష్మణరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
మరిన్ని వార్తలు