అడిగింది వంట నూనె.. ఇచ్చింది దీపం నూనె

19 Jul, 2016 23:59 IST|Sakshi
కేసముద్రం : వంట నూనె ఇవ్వమంటే గడువుతేదీ దాటిన నూనె ప్యాకెట్‌ ఇవ్వగా, ఆ నూనెతో వండిన కూర తిని ఇంటిల్లిపాది అస్వస్థతకు గురైన సంఘటన మండలంలోని అమీనాపురం గ్రామంలో మంగళవారం జరిగింది.
 
బాధితుల కథనం ప్రకారం. గ్రామానికి చెందిన బిర్రు యుగంధర్‌ ఇంట్లో వంటకాల కోసం సోమవారం సాయంత్రం గ్రామంలోని ఓ కిరాణ షాపువద్దకు వెళ్లి నూనె ప్యాకెట్‌ ఇవ్వమని అడిగాడు. దీంతో షాపులో కూర్చున్న యజమాని వంటనూనెకు బదులు(అరకేజీ) దీపారాధన ప్యాకెట్‌ను ఇచ్చింది. ఇది వంటనూనె కాదు గదా అని తెలుపగా, అదేనంటూ చెప్పి మరి ఇవ్వడంతో అతడు ఇంటికి తీసుకెళ్లాడు. ఆ నూనెతో కూరవండి తిన్నారు. దీంతో యుగంధర్‌ భార్య ప్రభ, కుమారుడు శ్రీవర్ధన్‌కు విరేచనాలయ్యాయి. స్థానిక వైద్యులను సంప్రదించి చికిత్స చేయించారు.
 
 వంట వండిన నూనె ప్యాకెట్‌ను పరిశీలించగా అది కేవలం దీపారాధనకు ఉపయోగించాలని ఉంది. పైగా గడవు తేదీ కూడా దాటిపోయింది. దీంతో బాధితుడు వెళ్లి షాపు యజమానిని ప్రశ్నించాడు. ఏదో పొరపాటున ఇచ్చామని వారు సర్దిచెప్పుకొచ్చారు. ఈ కిరాణంషాపుపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు తెలిపారు. 
>
మరిన్ని వార్తలు