అడిగితే.. అంతే!

2 Jun, 2017 00:58 IST|Sakshi
సాక్షి ప్రతినిధి, ఏలూరు : చింతలపూడి ఎత్తిపోతల పథకం కోసం తమ నుంచి సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లించా లని అడిగిన రైతులను ప్రభుత్వం కోర్టు మెట్లు ఎక్కించింది. పరిహారం ఇవ్వకుండా కాలువ తవ్వడానికి వీల్లేదన్న అన్నదాతలు గురువారం చింతలపూడిలోని కోర్టుకు హాజరుకావా ల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. భూసేకరణ ప్రక్రియ పూర్తికాకుండానే గత ఏడాది జూలైలో చింతలపూడి ఎత్తిపోతల పథకం కోసం రైతుల పొలాల్లోంచి కాలువ తవ్వేం దుకు అధికారులు సిద్ధమయ్యారు. తమకు సొమ్ములు చెల్లించకుండా కాలువ ఎలా తవ్వుతారంటూ అక్కడి రైతులంతా అధికారులను నిలదీశారు. భూములను సేకరించి.. పూర్తి నష్టపరిహారం చెల్లిం చాలని డిమాండ్‌ చేశారు. అధికారులు పట్టిం చుకోకపోవడంతో రైతులంతా కలిసి యర్రగుంటపల్లి వద్ద కాలువ తవ్వకం పనులను అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వానికి కోపమొచ్చింది. ఆ రైతులపై డీఈతో పోలీసులకు ఫిర్యాదు చేయించింది. చింతలపూడి జెడ్పీటీసీ రాధారాణి, యర్రగుంటపల్లి సర్పంచ్‌ సదరబోయిన వరలక్షి్మతోపాటు పిండపర్తి ముత్తారెడ్డి, పుల్లూరి సోమశేఖరాచార్యులు, అలవాల ఖాదర్‌బాబురెడ్డి, చిట్టూరి అంజిబాబు, మావూరి సత్యనారాయణరెడ్డి, జంగా రామచంద్రారెడ్డి, గుంటక రాఘవ, చిల్లూరి వెంకట లక్ష్మణరావు, గోలి శాంతరెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి వారందరికీ నోటీసులు రావడంతో గురువారం చింతలపూడి కోర్టుకు హాజరయ్యారు. కేసు ఈనెల 29వ తేదీకి వాయి
దా పడింది.
 
న్యాయం చేయకపోగా..
ఏడాది క్రితం రైతులు కాలువ పనులను అడ్డుకోగా.. ఇప్పటికీ వారికి న్యాయం జరగలేదు. యర్రగుంటపల్లిలోని రైతులకు ఒక్కపైసా కూడా పరిహారం అందలేదు. పరి హారం ఇవ్వకుండా పనులు  చేయాలని ప్రయత్నించడమే కాకుండా తమపై అక్రమ కేసులు బనాయించి కోర్టుకు లాగడంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబం ధించి ప్రభుత్వం ఇచ్చిన అవార్డును వ్యతిరేకిస్తూ పలువురు కోర్టులను ఆశ్రయించడం, దానిపై స్టే రావడం తెలిసిందే. భూసేకరణ మొత్తం అవినీతిమయంగా మారడం, లంచం తీసుకుంటూ అధికారులు పట్టుబడటంతో భూసేకరణ ప్రక్రియ ఎంత అడ్డగోలుగా సాగుతోందో స్పష్టమవుతోంది. రైతులపై కేసులు పెట్టడాన్ని చింతలపూడి ఎత్తిపోతల పథకం రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాఘవేంద్రరావు తీవ్రంగా ఖండించారు. రైతులను భయపెట్టి పనులు చేయాలని ప్రభుత్వం భావిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. 
 
మరిన్ని వార్తలు