పశ్చిమలోకి అశ్వారావుపేట

18 Apr, 2017 01:59 IST|Sakshi
పశ్చిమలోకి అశ్వారావుపేట
 జంగారెడ్డిగూడెం : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన అనంతరం వాటి సరిహద్దు ప్రాంతాల్లో భౌగోళికంగా ఏర్పడిన సమస్యలను సరిచేసేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. సరిహద్దు గ్రామాల మార్పు, చేర్పులకు సంబంధించి ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు కేంద్రానికి నివేదికలు పంపించినట్టు అధికార వర్గాల భోగట్టా. ఇందుకు కేంద్రం అనుమతి ఇస్తే మన జిల్లాతోపాటు పొరుగున ఉన్న తూర్పు గోదావరి జిల్లా ముఖచిత్రం మారుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న అశ్వారావుపేట, ఆ మండల పరిధిలోని ఆసుపాక, ఊట్లపల్లి, నారాయణపురం, గుమ్మడివల్లి గ్రామాలను మన జిల్లాలో విలీనం చేసేలా.. రాష్ట్ర విభజన సందర్భంగా భద్రాచలం మండలం నుంచి తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైన గుండాల, పురుషోత్తపట్నం, ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు పంచాయతీలను తిరిగి తెలంగాణ రాష్ట్రంలో కలిపేలా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఒక అంగీకారానికి వచ్చినట్టు చెబుతున్నారు. దీనిపై త్వరలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయనుందని సమాచారం.
 
సమస్యల పరిష్కారానికే..
రాష్ట్ర విభజన సందర్భంగా భద్రాచలం మండలంలోని కొన్ని గ్రామాలతోపాటు కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు, బూర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలు మన జిల్లాలో విలీనమయ్యాయి. అయితే, కుక్కునూరు నుంచి జీలుగుమిల్లి వరకు గల ప్రధాన రహదారి, దానిని ఆనుకుని ఉన్న గ్రామాలు తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్నాయి. కుక్కునూరు చేరుకోవాలంటే.. తెలంగాణ పరిధిలోగల అశ్వారావుపేట, ఆసుపాక, ఊట్లపల్లి, నారాయణపురం, గుమ్మడివల్లి గ్రామాల మీదుగా వెళ్లాల్సి ఉంది. ఈ పరిస్థితి వాహనాల రాకపోకలు, రెవెన్యూ విషయాల్లో సరిహద్దు సమస్యలకు కారణమవుతోంది. ఈ దృష్ట్యా ఆ ఐదు గ్రామాలను మన జిల్లాలో విలీనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇందుకు ప్రతిగా.. తూర్పుగోదావరి జిల్లాలో కలిసిన గుండాల, పురుషోత్తపట్నం, ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలిపేలా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అంగీకారానికి వచ్చినట్టు చెబుతున్నారు. 
 
జాతీయ రహదారి సమస్య
ఆంధ్రా–తెలంగాణ సరిహద్దులు సక్రమంగా లేకపోవడంతో జాతీయ రహదారి సమస్య కూడా తలెత్తింది. భద్రాచలం నుంచి కొవ్వూరు వరకు గల ప్రధాన మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిగా గుర్తించింది. భద్రాచలం, కుక్కునూరు ప్రాంతాల్లోని రహదారి మినహా అశ్వారావుపేట వరకు గల మార్గమంతా తెలంగాణలో ఉంది. అంతేగాక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కుక్కునూరు, వేలేరుపాడు వెళ్లాలంటే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అయిన అశ్వారావుపేట, వినాయకపురం, నారాయణపురం, ఆసుపాకల మీదుగా వెళ్లాల్సి వస్తోంది. ఒక రాష్ట్రంలోని గ్రామాలకు మరో రాష్ట్ర సరిహద్దులను దాటుకుని వెళ్లాల్సి రావడంతో çసమస్య తలెత్తుతోంది. 
 
నియోజకవర్గం ఏర్పాటులోనూ..
నియోజకవర్గం ఏర్పాటు విషయంలోనూ సమస్యలు తలెత్తడంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలు, గ్రామాలను పరస్పరం మార్చుకునేందుకు అంగీకరించినట్టు చెబుతున్నారు. ఇది కార్యరూపం దాలిస్తే విలీన మండలాలు, కొత్తగా కలిసే మండలాలు, గ్రామాలతో మన జిల్లా నైసర్గిక స్వరూపం మారుతుంది. 
 
మరిన్ని వార్తలు