అటకెక్కిన ఆంగ్ల మాధ్యమం

1 Aug, 2016 18:09 IST|Sakshi
 • నెరవేరని ప్రభుత్వ ఆశయం
 • ఇప్పటికీ ప్రారంభంకాని ఇంగ్లిషు మీడియం
 • పెద్దశంకరంపేట: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రుల్లో సర్కార్‌బడుల్లో ఇంగ్లిషు మీడియం అంటూ కొత్త ఆలోచనలు రేపినా ఆచరణలో సాధ్యమయ్యేలా లేదు. ప్రభుత్వం ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే ఇంగ్లిష్‌ మీడియం అంటూ ప్రచారం చేపట్టింది. అయితే మండలంలో నాలుగు పాఠశాలల్లో మాత్రమే ఇంగ్లిషు మీడియం ప్రతిపాదనలు పంపించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు గ్రామాల్లో ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, కరపత్రాలతో  భారీగా ప్రచారం చేపట్టారు.  తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కార్‌ బడికి పంపాలా లేక ప్రైవేట్‌ బడికి పంపాలో తేల్చుకోలేక ఈ ఏడాది ప్రైవేట్‌కే మొగ్గుచూపారు.

  ప్రతి యేటా బడిబాట పేరుపై ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులు గ్రామాల్లో ర్యాలీలు తీస్తూ భారీగా ప్రచారం చేపడుతున్నా తల్లిదండ్రులను మాత్రం ఆకర్షించలేకపోతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై యాభై రోజులు పూర్తయినా ఇప్పటి వరకు మండంలో ఇంగ్లిషు మీడియం ప్రారంభం కాలేదు. ఇంగ్లిషు మీడియంలో తమ పిల్లలను 100 శాతం చేర్పిస్తే రూ.లక్ష నజరానాతోపాటు, ఆ పాఠశాలకు అదనంగా రూ.20 వేలు అందజేస్తామని కలెక్టర్‌ ప్రకటించారు. కానీ విద్యార్థులను బడిలో చేర్చుకునేందుకు 5 ఏళ్లు  నిండి ఉండాలనే తప్పనిసరి నిబంధన తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారింది.
  సర్కారు ముందుకు వచ్చినా...
  రోజురోజుకు దిగజారుతున్న సర్కారు బడులను బలోపేతం చేసేందుకు సర్కారు ముందుకు వచ్చినా ఫలితం మాత్రం కనిపించేలా లేదు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రారంభించేందుకు జీఓ 524ను విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీ,  గ్రామపంచాయితీ, గ్రామాభివృద్ధి కమిటీలు తీర్మానం చేసి విద్యాశాఖకు అందజేయాలి.
  ముందుకు వచ్చింది కేవలం నాలుగు పాఠశాలలే..
  పెద్దశంకరంపేట మండలంలో 46 పాఠశాలలున్నాయి. ఇందులో 7 ఉన్నత, 13 ప్రాథమికోన్నత, 26 ప్రాథమిక పాఠశాలలున్నాయి. ఇందులో కస్తూర్బా, మోడల్‌ స్కూళ్లు ఉన్నాయి.  ఈ పాఠశాలల్లో 5420 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు పెద్దశంకరంపేటలోని బాలికల ప్రాథమిక, వీరోజిపల్లిలోని ప్రాథమిక, చీలాపల్లి, రామోజిపల్లిలోని పాఠశాలలు మాత్రమే ఇంగ్లిషు మీడియంలో ప్రవేశాలకు ముందుకు వచ్చాయి. ఇంత పెద్ద మండలంలో కేవలం కొన్ని పాఠశాలలు మాత్రమే ఇంగ్లిషు మీడియాన్ని ప్రారంభించేందుకు ముందుకు వచ్చినా ఇప్పటి వరకు ప్రారంభం కాకపోవడం విచారకరం.

  ఇంగ్లిషు మీడియం అని తెలిపినా ఇప్పటి వరకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు కూడా పంపిణీ చేయలేదు.  ప్రభుత్వం స్పందించి అన్ని పాఠశాలల్లో పూర్థి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తూ ప్రతి పాఠశాలలో ఇంగ్లిషు మీడియాన్ని ప్రారంభించేలా జీఓ విడుదల చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇక చిన్నారుల వయస్సును 5 నుంచి 3 తగ్గించడంతో పాటు నర్సరీలకు అవకాశం కల్పిస్తే ఇంగ్లిషు మీడియం సర్కారు బడులకు మహర్దశపట్టే అవకాశం ఉంది. కనీసం వచ్చే ఏడాదైనా ముందుగా ప్రణాళికలు రూపొందించి ఇంగ్లిషు మీడియం పాఠశాలలను ప్రారంభిస్తే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మేలు చేకూరుతుంది.

మరిన్ని వార్తలు