దరికిరాని శ్రీమంతుడు

15 Apr, 2016 10:43 IST|Sakshi
దరికిరాని శ్రీమంతుడు

జిల్లాలో ప్రతిగ్రామాన్ని ఆకర్షణీయ(స్మార్టు) గ్రామంగా తీర్చి దిద్దాలి. ప్రతివార్డు అందంగా రూపు మార్చుకోవాలి. అందమైన గ్రామాలు, నగరాలుగా వృద్ది చెందాలి. స్వచ్ఛభారత్ ట్రస్టు నిర్థేశించిన ప్రకారం 20 సూత్రాలు ఆచరణ సాధ్యం కావాలి. దత్తత స్వీకరించిన వారి సహకారాన్ని అందిపుచ్చుకుని అభివృద్ధి పథంలో నడవాలి.

ఇదీ స్మార్ట్ లక్ష్యం. ఈ లక్ష్యంతోనే జిల్లా కలెక్టరు, జారుుంట్ కలెక్టరు, దిగువస్థాయి అధికారుల వరకు ఒక్కోగ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అక్కడ వసతుల కల్పనతోపాటు మార్పు తీసుకు రావడానికి ప్రయత్నం మొదలు పెట్టారు. ప్రజా ప్రతినిధులు కూడా తాము ఉన్నామంటూ మరి కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారు. కానీ ఈ గ్రామాల్లో స్టార్టు ప్రయత్నాలు కనిపించడం లేదు.
 
శ్రీకాకుళం :  గత ఏడాది జనవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామాలను..పట్టణాలను స్మార్టుగా మార్చుతామంటూ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులూ, ఎమ్మెల్యేలు,మండల స్థాయి ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఏడాది గడిచినా లక్ష్యం దిశగా ఒక్కఅడుగూ ముందుకు కదలలేదు. గ్రామాల దత్తత వరకు ఎవరికివారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రకటించినా తర్వాత విస్మరించారు. ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్-1 అధికారులు,ఎన్‌ఆర్‌ఐలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతరులు కూడా స్పందించారు.
 
గ్రామాలు, వార్డులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ముందుకొచ్చారు. ఆరంభంలో ఆర్భాటంగానే ఈప్రక్రియ సాగింది. అందరూ సంతోషించారు. ఈ ఆనందం ఎక్కువ కాలం నిడబడలేదు. భాగస్వాములుగా కొందరు ముందుకు వచ్చినా సూక్ష్మస్థాయి ప్రణాళికలు లోపించడంతో ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. ఎంపిక చేసిన గ్రామాలు, వార్డుల్లో చేపట్టాల్సిన అభివృద్ధికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించలేని స్థితిలో అధికార యంత్రాంగం ఉంది.
 
స్మార్టు అంటే..
స్మార్టు గ్రామం అంటే సామాన్యులకు సోషల్‌స్కిల్స్, ఆధునిక సాంకేతిక ఆలోచనల వైపునకు గ్రామీణులను నడిపించడం,  దత్తతపై అవగాహన, సామాజిక బాధ్యతకు సిద్ధం చేయడం, సాంకేతికత ద్వారా పారదర్శకంగా ఉం డేందుకు గ్రామాలను తయారు చేయడమే స్మార్ట్ లక్ష్యం. జిల్లాలో 1246 గ్రామాలను దత్తత గ్రామాలుగా అభివృద్ధి చేయడానికి ఎంపిక చేశారు. వాటిని దత్తత తీసుకునేందుకు 933 దరఖాస్తులు వచ్చాయి. 79 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 683 మంది పూర్తి దత్తతకు దరఖాస్తు చేసుకోగా 161 మంది సెక్టార్ల వారీగా దత్తత స్వీకరించారు.
 
సమావేశాలతోనే సరి..
దత్తత స్వీకరించిన గ్రామాల్లో మార్పు తీసుకు రావాలన్న తొలిప్రయత్నంలో సమావేశాలు నిర్వహించారు. సమావేశాలలో హాజరైన వారే సమస్యలను గుర్తు చేస్తూ ప్రసంగాలు ఊదరగొట్టారు. ఇది ఆరంభ శూరత్వంగానే మిగిలిపోరుుంది. దత్తత తీసుకుని ఏడాది గడచినా ఇంతవరకు ఆగ్రామాల్లో నామమాత్రపు లక్ష్యాలను సాధించలేకపోయారు. శతశాతం అక్షరాస్యత,  బహిరంగ మలవిసర్జన, పారిశుధ్య నిర్వహణవైపు దృష్టి సారించలేదు. ఏడాది గడిచినా ఆ గ్రామాలను సమస్యలు వీడలేదు.
 
మారిన పరిస్థితులకు అనుగుణంగా పారిశుధ్యం ప్రాధాన్యతాంశం. శతశాతం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా పరిసరాల పరిశుభ్రత , ఆరోగ్యం వంటి సౌకర్యాలు కుదుటపడతాయి. శతశాతం అక్షరాస్యత సాధించడానికి సాంకేతిక విద్య ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార, వాణిజ్య విషయాలతోపాటు విద్య, ఇతర విషయాలు అవగాహన పెంచుకోవచ్చు. రోడ్లు, కాల్వలు, ఇతర మౌలిక సదుపాయాలు అందుకునేందుకు వీలుకలుగుతుంది.
 
శంభాంలో నెలకొకరోజు..
కలెక్టరు డా.లక్ష్మీనృసింహం సీతంపేట మండలం శంభాం గిరిజన గ్రామాన్ని దత్తత స్వీకరించారు. నెలరోజుల కొకమారు గ్రామాన్నిసందర్శిస్తున్నారు. సౌకర్యాలు మాత్రం వారికి అందనంత ఎత్తులోనే ఉన్నాయి. శతశాతం విద్య సాధించడానికి కృషి జరుగుతోందని కలెక్టరు చెబుతున్నారు.
 
ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు సంతబొమ్మాళి మండల కేంద్రాన్ని దత్తత తీసుకున్నారు. ఆగ్రామానికి ఆయన సందర్శించడం తప్ప అక్కడ చేసిన అభివృధ్ధి కనిపించడం లేదు.
మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి మండలం బన్నువాడ గ్రామాన్ని దత్తత స్వీకరించారు. ఇక్కడ తాగునీరు, పారిశుద్య సమస్యలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. దత్తత స్వీకరిం చిన నాటినుంచి గ్రామానికి రెండు సార్లు మంత్రి అచ్చెన్నాయుడువచ్చి వెళ్లారని, కాని సమస్యల పరిష్కారం మాత్రం ఇంతవరకు నోచుకోలేదని గ్రామస్థులు చెపుతున్నారు.
ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఆమదాలవలస మండలం చిట్టివలస గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈగ్రామాన్ని ఆయన మూడు సార్లు సందర్శించినా సమస్యల పరిష్కారం మొదలు కాలేదు.
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల సింగుపురం, వప్పంగి గ్రామాల్లో పాఠశాలలను దత్తత తీసుకుని సాంకేతిక విద్యను అందిస్తున్నారు.
రాజాం పట్టణాన్ని జీఎంఆర్ సంస్థ దత్తత స్వీకరించింది. ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరించినా ఇంతవరకు మార్పు దిశగా అడుగులు మొదలు కాలేదు.
ఇలా జిల్లా వ్యాప్తంగా దత్తత తీసుకున్న వారు 553మంది ఉన్నారు. వీరంతా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకుని గ్రామాలను దత్తత స్వీకరించడానికి ముందుకొచ్చారు. అయితే ఆస్థాయిలో పల్లెల్లో  మార్పు కనిపించడం లేదు.
 
అచ్చెన్నా..మరిచేనా..
టెక్కలి: టెక్కలి మండలంలో బన్నువాడ గ్రామాన్ని మంత్రి కె.అచ్చెన్నాయుడు దత్తత తీసుకున్నారు. ఏడాది గడుస్తున్నప్పటికీ గ్రామంలో అభివృద్ధి చర్యలు కానరావడం లేదు. సుమారు 1700 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో పూర్తి స్థాయిలో మురుగు కాలువలు లేవు.  వినియోగించిన నీరంతా రోడ్లపైనే ప్రవహిస్తోంది. కాలువలు అసంపూర్తిగా నిర్మించారు. దీంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఉనికి కోల్పోయూరుు. గ్రామంలో పూర్తి స్థాయిలో మరుగుదొడ్లు కూడా లేవు. గ్రామంలో వంశధార కాలువకు ఆనుకుని ప్రమాదకర పరిస్థితుల్లో అంగన్‌వాడీ భవనం నిర్మిస్తున్నారు. ఈవిషయంలో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు.
 
విప్ గారూ ..ఒకసారి రండి
జనాభాః758, నివాస గృహాలుః 217,
ఆమదాలవలస : ప్రభుత్వ విప్ కూన రవికుమార్ చిట్టివలస గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. స్మార్ట్ విలేజ్‌గా తీర్చిదిద్దుతానని ఆ గ్రామంలో ప్రతిజ్ఞ కూడా చేశారు. ఆ హడావిడి సర్వే, సమీక్షలకే పరిమితమైంది. కనీస వసతులు కూడా కల్పించలేదని ప్రజలు వాపోతున్నారు. రూ. 9లక్షల వ్యయంతో మంచినీటి పథకాన్ని నిర్మిస్తానన్నారు. శివార్లలో బోరు తవ్వించి ట్యాంకు నిర్మించకుండా నేరుగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి కుళాయిలు బిగించారు. ఇప్పటికీ అది ప్రారంభం కాలేదు. ఏడాదిగా ప్రభుత్వ విప్ గ్రామం వైపు కన్నెత్తి చూసిన దాఖలా కూడా లేదు.

మరిన్ని వార్తలు