ఎట్టకేలకు నీటి విడుదల

3 Oct, 2016 01:44 IST|Sakshi
– ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతి పేరుతో గత నెలలో ఎల్లెల్సీకి నీటిని బంద్‌ చేసిన టీబీ బోర్డు
– రెండు సార్లు లేఖ రాసిన అధికారులు
– సీడబ్ల్యూసీ చైర్మన్‌కు ఎంపీ బుట్టా రేణుక ఫిర్యాదు
– ఇందుకు స్పందనగా నీరు విడుదల
 
కర్నూలు సిటీ:
టీబీ డ్యాంలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయంటూ గత నెల 17న ఏపీ ప్రభుత్వ అనుమతి లేకుండానే నీటి విడుదలను నిలిపేసిన బోర్డు అధికారులు ఎట్టకేలకు ఆదివారం విడుదలను పునరుద్ధరించారు. ప్రాజెక్టు పవర్‌ కెనాల్‌ ద్వారా 1120 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గత నెల 27న నీటిని విడుదల చేయాల్సి ఉన్నా బోర్డు అధికారులు పట్టించుకోలేదు. దీంతో దిగువ కాలువ ఆయకట్టుకు సాగునీటి ఇబ్బందులున్నాయంటూ ఎస్‌ఏ ఎస్‌. చంద్రశేఖర్‌ రావు ఉన్నతాధికారులకు రెండుసార్లు లేఖలు రాశారు. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌తోపాటు మంత్రి దష్టికి తీసుకెళ్లినా వారిలో వారిలో స్పందన లేకపోయింది. గత నెల 20న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి టీబీ బోర్డు చైర్మన్‌ రంగారెడ్డి, మంత్రి దష్టికి తీసుకెళ్లగా రెండు రోజుల్లో నీరు ఇస్తామని చెప్పినా పట్టించుకోలేదు. ఇదే విషయంపై కర్నూలు ఎంపీ బుట్టారేణుక కేంద్ర జల సంఘం చైర్మన్‌ గుప్తాకు ఫిర్యాదు చేయడంతో బోర్డు అధికారుల్లో కదలిక వచ్చింది. 
ఆయకట్టుకు నీరందేనా?
 దిగువ కాలువ కింద జిల్లాలో 1.51 లక్షల ఎకరాల ఆయకట్టుంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో సుమారు 90 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని జల వనరుల శాఖ ప్రణాళికలో తెలిపారు. ప్రస్తుతం 40 వేల ఎకరాల్లో పంటలుండగా 15 వేల ఎకరాల్లో వరి వేశారు. ఈ ఏడాది 24 టీఎంసీలకుగాను 17 టీఎంసీల నీటిని వాటాగా కేటాయించారు. ఇప్పటీ వరకు 2.87 టీఎంసీల నీటిని వాడుకున్నారు. డ్యాంలో నీరు తక్కువగా ఉందని, పంటను కాపాడుకునేందుకు ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిన నీటిని ఇవ్వాలని కర్ణాటక నీటిపారుదల సలహా సమితి సూచించడంతో గత నెల 17న బోర్డు అధికారులు కాల్వకు నీటిని బంద్‌ చేశారు. తిరిగి అదే నెల 27న నీరు విడుదల చేయాల్సి ఉంది. కానీ బోర్డు అధికారులు కర్ణాటక ఆయకట్టును దష్టిలో పెట్టుకొని ఏపీ వాటాకు, ఆ రాష్ట్ర వాటా నీటిని కలిపి విడుదల చేశారు. మధ్యలోనే కాల్వలకు పైపులు, మోటార్లు వేసి నీటిని కాజేసేందుకే కొంత ఆలస్యంగా  విడుదల చేసినట్లు తెలిసింది. దీనికితోడు కాల్వపై గస్తీ పెట్టి ఏపీ సరిహద్దులో 690 క్యుసెక్కుల నీటిని ఇవ్వలేమని, ఇప్పటీకే కర్ణాటక ప్రభుత్వం పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. ఇలాంటి సమయంలో విడుదల చేసిన నీరు జిల్లాకు ఏ మేరకు వస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
మరిన్ని వార్తలు