ఏమార్చి ఏటీఎం కార్డు కొట్టేశాడు!

11 Jul, 2016 17:48 IST|Sakshi

జోగిపేట (మెదక్) : పక్క వ్యక్తి నుంచి తెలివిగా ఏటీఎం కార్డును కొట్టేసిన ఓ ఘనుడు అదే కార్డు నుంచి రూ.10వేలు డ్రా చేసుకొని ఉడాయించిన ఘటన ఇది. మెదక్ జిల్లా జోగిపేటలో జరిగింది. అల్లాదుర్గం మండలం బిబిజీపూర్ గ్రామానికి చెంది ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ లింగపురం రాములు ఆదివారం జోగిపేటలో బస్టాండ్ వద్ద ఉన్న ఏటీఎంకు వెళ్లాడు. అప్పటికే ఆ ఏటీఎం వద్ద చాంతాడంత లైను ఉంది. ఆ వరుసలో ముందు నిలబడి ఉన్న ఓ అపరిచితుడు.. తనకి ఏటీఎం కార్డు ఇస్తే డబ్బులు డ్రా చేసి ఇస్తానంటూ నమ్మబలికాడు. నిజమేననుకుని అతడి వంతు వచ్చేదాకా అక్కడే ఉండి..అతనితో కలిసి డబ్బు డ్రా చేసేందుకు వెళ్లాడు. రాములు కార్డు ఇవ్వగా ఆ వ్యక్తి ఆ కార్డును తీసుకొని ఏటీఎం మిషన్‌లో పెట్టి తీసి సీక్రెట్ నంబరు కొట్టమని చెప్పాడు.

ఆ నంబరును గుర్తుంచుకున్న అపరిచితుడు తర్వాతి ఆప్షన్‌లను తప్పుగా నొక్కి ఆ కార్డు పనిచేయడంలేదంటూ తన వద్ద నున్న మరో సీతారాం అనే పేరున్న ఏటీఎం కార్డును రాములు చేతిలో పెట్టి అక్కడి నుంచి నిష్ర్కమించాడు. అయితే, లైన్‌లోనే ఉన్న రాములు కొద్దిసేపటి తర్వాత ఏటీఎం మిషన్‌లో కార్డు పెట్టగా వేరొక పేరు కనిపించింది. దీంతో రాములు అపరిచితుడి కోసం అటూఇటూ గాలించాడు. కనిపించకపోవడంతో వెంటనే తన ఏటీఎం కార్డును బ్లాక్ చేయాలంటూ బ్యాంకు సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో అతని సెల్‌కు రూ.10 వేలు డ్రా చేసినట్లు మెసేజ్ అందింది. సోమవారం ఎస్‌బీహెచ్ బ్యాంకుకు వెళ్లగా స్థానిక క్లాక్‌టవర్ ఏటీఎంలో నుంచి రూ.10 వేలు డ్రా అయినట్లు అధికారులు తెలిపారు. బాధితుడు జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఏటీఎంలలోని సీసీ కెమెరాల పుటీజీలను పరిశీలించి నిందితుడి ఆచూకీ తెలుసుకుంటామని ట్రైనీ ఎస్సై గౌతం తెలిపారు.

మరిన్ని వార్తలు