దారుణం

11 Jan, 2017 00:04 IST|Sakshi
దారుణం

వేముల(పులివెందుల): వేముల మండలం నల్లచెరువుపల్లెలో దారుణం జరిగింది. భార్య గొంతు కోసి.. తాను విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి మరణంతో మూడేళ్ల చిన్నారి అనాథగా మారింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన కవిత(21)తో వేముల మండలం నల్లచెరువుపల్లె ఎస్సీ కాలనీకి చెందిన పరిగల రామాంజనేయులు(31)కి ఐదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి అయిన ఏడాది పాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో కొన్నాళ్ల పాటు వీరు అత్త ఊరైన లింగాపురంలోనే జీవనం సాగించారు. ఇటీవల సొంత గ్రామమైన నల్లచెరువుపల్లెకు చేరుకొని మృతుడి తల్లిదండ్రులు బ్రహ్మయ్య, ఓబుళమ్మతో కలిసి ఉన్నారు. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేశారు. రామాంజనేయులు, కవిత ఇంట్లో నిద్రించగా.. బ్రహ్మయ్య, ఓబుళమ్మ, మనుమరాలు బ్రహ్మణి ఇంటి బయట నిద్రపోయారు. మంగళవారం తెల్లవారుజామున 2.16 గంటలకు మనుమరాలు బ్రహ్మణికి నీరు దప్పిక కావడంతో.. వారు పిలవగా లోపలి నుంచి ఎవరూ పలకలేదు. దీంతో అనుమానం వచ్చి గట్టిగా అరిచారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ లోపే చుట్టు పక్కల వారు నిద్ర లేచి గుమికూడారు. ఇంటి ద్వారం వద్ద రక్తపు మడుగులో కవిత పడి ఉండటాన్ని గమనించారు. ఆమె గొంతు కోయబడింది. రామాంజనేయులు నోటి నుంచి బురగ కారుస్తూ పడి ఉండటాన్ని చూడారు. అప్పటికే వీరు మృతి చెందినట్లు గుర్తించారు.
అనాథగా మారిన చిన్నారి :
తల్లిదండ్రుల మరణంతో మూడేళ్ల కుమార్తె బ్రహ్మణి అనాథగా మారింది. తల్లిదండ్రులు చనిపోయిన విషయం సరిగా తెలియని ఆ చిన్నారి అమాయకంగా చూస్తూ.. ఏడుస్తుండటం అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించింది. అయితే తమ కుమార్తె, అల్లుడును మృతుడి తల్లిదండ్రులు బ్రహ్మయ్య, ఓబుళమ్మతోపాటు సోదరుడు పవన్‌ కలిసి చంపారనే అనుమానం కింద మృతురాలి తండ్రి బాలరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేంద్రకుమార్‌ తెలిపారు.
ఆస్తి తగాదాలతోనే చంపారని ఆరోపణ :
తన కుమార్తె కవితను అల్లుడు రామాంజనేయులు గొంతు కోసి చంపేసి.. విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు  ప్రయత్నించాడని మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారని మృతురాలి తండ్రి బాలరాజు పేర్కొన్నాడు. అయితే కొన్నాళ్లుగా ఆస్తి కోసం గొడవ పడుతున్నారని.. ఆస్తి పంచి ఇవ్వమంటే.. తల్లిదండ్రులు పట్టించుకోలేదని  ఆయన ఆరోపించాడు. ‘మీ కుమార్తె, అల్లుడు చనిపోయారు’ అని మృతుడి సోదరుడు ఫోన్‌ చేసి చెప్పారని చెప్పాడు.


 

మరిన్ని వార్తలు