కలకలం రేపిన బ్రూణ హత్యలు

4 Aug, 2016 23:00 IST|Sakshi
కలకలం రేపిన బ్రూణ హత్యలు
సమాజంలో సగభాగమంటున్నారు.. ఆకాశంలో ఆమె అంటూ గొప్పలకు పోతున్నారు.. అతివల రక్షణకు అనేక చట్టాలు.. కానీ తల్లిగర్భంలోని మాలాంటి పసిగుడ్డులకు ఏదీ రక్షణ..? ఇంకా అవయవాలు కూడా ఏర్పడని ఆడశిశువులకు నోరుంటే అడిగే ఇలాంటి ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు.. నవమాసాలు మోసి లోకాన్ని చూపించాల్సిన తల్లులు..ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లే ఆడశిశువులను చిదిమేశారు. 
 
మిర్యాలగూడ అర్బన్‌
జిల్లాకు మరో మాయని మచ్చలా మిర్యాలగూడలో బ్రూణహత్యలు వెలుగుచూడడం కలకలం రేపింది. పట్టణంలోని ఎన్‌ఎస్పీ అతిథిగృహం రోడ్డుపై ఉదయం 6.30 గంటలకు రెండు నెలలు నిండని పిండాలు ప్లాస్టిక్‌ కవర్లో పడి ఉన్నాయి. మృత శిశువుల శరీర భాగాలతో పాటు ఆస్పత్రిలో ఉపయోగించే గౌజ్‌లు, ఇంజక్షన్ల కవర్లను స్థానికులు గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకుని టూటౌన్‌ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.  వెంటనే ఆ నెలలు నిండని శిశువుల పండాలను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టన్‌ గదిలో ఉన్న శిశువుల మృతదేమాలను డీఎంహెచ్‌ఓ భానుప్రసాద్‌నాయక్, ఫోరెన్సిక్‌ వైద్యులు బాలనరేంద్ర పరిశీలించారు. రెండు శిశువులు కూడా సుమారు 5నెలల వయస్సు ఉంటుందని తెలిపారు. క్లస్టర్‌ అధికారి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ పాండురంగారెడ్డి తెలిపారు. 
ధనార్జనే ధ్యేయంగా..
 పట్టణంలోని కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల వైద్యులు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. రాత్రి సమయంలో అబార్షన్లు చేసి ఆ పిండాలను కవర్‌లో తరలించే సమయంలో రోడ్డుపై పడి ఉంటాయని, పడిన వాటిని కవర్‌లో ఎత్తే సమయంలో ఎవరైనా చూస్తారనే అనుమానంతో అక్కడే వదిలి వేసి ఉంటారని పలువురు పేర్కొంటున్నారు. వాటిలో ఒక శిశువు పూర్తిగా ఉండగా మరో శిశువు సగభాగం తెగి ఉంది. వాటిని పరిశీలించిన వైద్యులు మృతపిండాల వయసు సుమారు 5నెలలు ఉంటుందని ఆవి రెండు కూడా ఆడ శిశువుల పిండాలుగా గుర్తించామని తెలిపారు. 
ఆస్పత్రుల్లో డీఎంహెచ్‌ఓ తనిఖీలు:
బ్రూణ హత్యలు జరిగిన విషయాన్ని స్థానిక డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ల కృష్ణకుమారి డీఎంహెచ్‌ఓ భానుప్రసాద్‌నాయక్‌కు తెలియజేయడంతో హుటాహటిన మిర్యాలగూడకు చేరుకున్నారు. డీఎంహెచ్‌ఓ క్లస్టర్‌ కార్యాలయంలో పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారు. కాగా ఈ విషయంపై మూడు ఆస్పత్రుపై అనుమానాలున్నాయని సీఐ పాండురంగారెడ్డి తెలిపిన విషయాన్ని ఆయనకు క్లస్టస్టర్‌ అధికారులు వివరించారు. వెంటనే పట్టణంలోని మూడు ప్రైవేటు ఆస్పత్రులు శ్వేత నర్సింగ్‌ హోం, శ్రీదేవి నర్సింగ్‌హోం, లక్ష్మీసాయి ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. కాన్పులు, ఓపీ, ఎంటీపీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్‌ అనంతరం వెలువడే వేస్టేజీని ఎలా నిర్వీర్యం చేస్తారని విచారించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ అబార్షన్లు చేసినట్లు తేలితే ఆ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసుల దర్యాప్తుతో పాటు తాము గ్రామీణ ప్రాంతాల్లో ఆశ కార్యకర్తల ద్వార పూర్తి సమాచారాన్ని తెప్పించి సమగ్ర విచారణ చేపడతామని, దోషులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
 ఆకస్మిక తనిఖీల్లో ఆసక్తిర విషయాలు..
కాగా పట్టణంలోని ప్రైవేట్‌ ఆస్పత్రునుల ఆకస్మికంగా తనిఖీచేసిన వైద్యాధికారులకు పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా వరకు ఆస్పత్రుల్లో కాన్పుల కోసం వచ్చే వారి వివరాలను రికార్డుల్లో నమోదు చేయకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరి కొన్ని ఆస్పత్రుల్లో బయోవేస్టేజీని సదరు నిర్వాహకులకు ఇవ్వకపోవడంపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల్లో క్లస్టర్‌ అధికారులు సీహెచ్‌ఓ శ్రీనివాసస్వామి, భగవాన్‌నాయక్, వెంకటయ్య పాల్గొన్నారు.
 
 
 
 
మరిన్ని వార్తలు