నకిలీ కారం పట్టివేత

4 Nov, 2016 17:18 IST|Sakshi
నకిలీ కారం పట్టివేత
* తయారు చేసే మిల్లులు, 
కోల్డ్‌స్టోరేజీపై విజిలెన్స్‌ దాడులు
కారం అక్రమ నిల్వల గుర్తింపు
 
గుంటూరు రూరల్‌: నకిలీ కారం తయారు చేసే మిల్లులు.., నకిలీ కారం, చైనా కారం నిల్వ ఉంచిన కోల్డ్‌ స్టోరేజ్‌లపై విజిలెన్స్‌ ఎస్పీ శోభామంజరి ఆధ్వర్యంలో గురువారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 2 కోట్ల రూపాయల విలువ చేసే నకిలీ కారం, చైనా కారం, అక్రమంగా నిల్వ ఉంచిన కారం నిల్వలను సీజ్‌ చేశారు.
  
మిరప తొడాలతో నకిలీ కారం..
గుంటూరు నగరంలోని మిర్చి యార్డు సమీపంలోగల భువనేశ్వరి ఇండస్ట్రీస్‌ కారం మిల్లులో నకిలీ కారం తయారు చేస్తున్నారని అందిన సమాచారం మేరకు దాడులు చేసినట్లు విజిలెన్స్‌ ఎస్పీ శోభామంజరి తెలిపారు.  మిల్లులో మిరపకాయల తొడాలతో నకిలీ కారం తయారు చేసి, దానికి ఎరుపురంగును కలిపి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారని గుర్తించినట్లు తెలిపారు.  మిల్లులోని 9 బస్తాల రంగు, 72 బస్తాల కల్తీ కారం, 52 బస్తాల తాలుమిరపకాయలు, 15 బస్తాల మిరపకాయల తొడాలను సీజ్‌చేశామని, వీటి విలువ రూ. 15 లక్షల వరకూ ఉంటుందని తెలిపారు. మిల్లు యజమాని కాశయ్యపై నకిలీ వస్తువుల తయారీ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
 
మిరపకాయ పిప్పికి కెమికల్స్‌ కలిపి...
అదేవిధంగా ఏటుకూరు గ్రామంలోని ఉదయ్‌ ఆగ్రో ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏసీ గోడౌన్‌పై దాడిచేసి ఏసీలో అక్రమంగా నిల్వ ఉంచిన 5 వేల బస్తాల నకిలీ చైనా కారం సీజ్‌ చేసినట్లు విజిలెన్స్‌ ఎస్పీ  తెలిపారు. ఈ నకిలీ చైనా కారం ఖమ్మం జిల్లాలో తయారవుతుందని, మిరపకాయలనుంచి నూనె, రంగు ఇతర కంటెన్స్‌ను వెలికి తీయగా మిగిలిన పిప్పికి ఎరుపు రంగును కలిపి విక్రయిస్తారన్నారు. ఈ పిప్పిలో పలు రకాల కెమికల్స్‌ కలిపి కారంగా మార్కెట్‌లోకి విడుదల చేస్తారన్నారు. ఈ కారం విలువ సుమారు కోటిన్నరకు పైగా ఉంటుందన్నారు. గతంలో చైనా కారంను 9 వేల బస్తాలకు పైగా ఇక్కడ నిల్వ ఉంచారని, అందులో సుమారు నాలుగు వేల బస్తాలను కల్తీ చేసి మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు విచారణలో తేలిందని,   ఏడుగురు వ్యక్తుల పేర్లపై గోడౌన్‌లో చైనా కారం నిల్వ ఉంచినట్లు రికార్డులు చెబుతున్నాయని,  వివరాలు తేలాల్సిఉన్నాయన్నారు. అదేవిధంగా కోల్డ్‌ స్టోరేజ్‌లో లెక్కలు చూపని మిరపకాయలు, కారం సైతం నిల్వలున్నాయని, వాటి విలువ మరో రూ. 10 లక్షలకు పైగా ఉంటుం దని తెలిపారు. ఉదయ్‌ ఆగ్రో ప్రైవేట్‌ లిమిటెడ్‌ కోల్డ్‌స్టోరేజ్‌ గోడౌన్‌ గుమస్తా అప్పారావును అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
 
లెక్కలు చూపకుండా నిల్వ...
లక్ష్మీగణపతి కోల్డ్‌ స్టోరేజ్‌కు చెందిన సుమారు 400 బస్తాల కారం రికార్డుల్లో లెక్కలు చూపకుండా నిల్వ చేశారని, గోడౌన్‌లో లక్ష్మిగణపతి పేరుతో ఉన్నా సరుకు తమదికాదని అంటున్నారని విచారించి వివరాలను వెల్లడిస్తామన్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన సరుకు విలువ సుమారు రూ. 30 లక్షలవరకూ ఉంటుందని తెలిపారు.  అదేవిధంగా ఏటుకూరు పరిసర ప్రాంతాల్లో  పత్తి గింజల పిప్పితో పశువుల దాణా తయారీ చేసే కేంద్రాలపై కూడా పలు ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలించి నకిలీలు, ప్రమాదభరితమైన ఆహారపదార్థాలైతే వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. దాడులలో డీఎస్పీ రమణకుమార్, సీఐలు ఆంథోనిరాజు, కిషోర్‌బాబు, ఏవో వెంకటరావు, డీసీటీవో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు