బాణాసంచా అక్రమ నిల్వలపై దాడులు చేయండి

22 Oct, 2016 21:54 IST|Sakshi
బాణాసంచా అక్రమ నిల్వలపై దాడులు చేయండి
- వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా పోలీసు అధికారులకు డీజీపీ ఆదేశం 
 
కర్నూలు:  దీపావళికి లైసెన్స్‌ లేకుండా బాణాసంచా అక్రమంగా నిల్వ ఉంచిన గోదాములపై దాడులు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డీజీపీ ఎన్‌.సాంబశివరావు పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం అన్ని జిల్లాల పోలీసు అధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, ఎస్పీ ఆకే రవికృష్ణ, అదనపు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ నేరాల అదుపునకు అధునాతన సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించాలని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్లలో పనితీరులో మార్పు రావాలన్నారు. శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడరాదన్నారు. ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌లో విలువైన ప్రాపర్టీని నిరుపయోగంగా ఉంచుకోకుండా వినియోగించుకోవాలని సూచించారు. 
 
పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌కు శిక్షణ కేంద్రాలను సిద్ధం చేయండి
రాబోయే పోలీసు రిక్రూట్‌మెంట్‌ శిక్షణకు డీటీసీ, పీటీసీ శిక్షణ కేంద్రాలను సిద్ధం చేసి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. రాబోయే పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ డిజిటలైజ్‌గా జరగాలని ఆదేశించారు. జేఎన్‌టీయూ కాకినాడ వారు ఈ పరీక్షలను నిర్వహిస్తారని వెల్లడించారు. ఏపీఎస్‌ఎల్‌ పీఆర్‌బీ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ చైర్మన్‌ అతుల్‌సింగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ షెడ్యూల్‌ వివరాలను జిల్లాల వారీగా పోలీసు అధికారులకు వెల్లడించారు.  ఏఆర్‌ అదనపు ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు రమణమూర్తి, ఏజీ కృష్ణమూర్తి, రాజశేఖర్‌రాజు, ఏఓ అబ్దుల్‌ సలాం, సీఐలు కృష్ణయ్య, పవన్‌కిషోర్, పార్థసారధి, రామాంజనేయులు, సూపరింటెండెంట్‌ చంద్రశేఖరయ్య, ఆర్‌ఐలు రంగముని, జార్జి, ఈకాప్స్‌ ఎస్‌ఐ రాఘవరెడ్డి, డీసీఆర్‌బీ, స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐలు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.   
 
మరిన్ని వార్తలు