మహిళలపై దాడులు ఆందోళనకరం

9 Jan, 2017 02:38 IST|Sakshi
తణుకు : ఇటీవల కొంతకాలంగా మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం తణుకు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం దాడులు పెరుగుతున్నాయని, ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్నా కొన్ని వెలుగులోకి రావడంలేదన్నారు. దాడుల విషయంలో ఎవరి ప్రమేయం ఉన్నట్టు రుజువైనా పార్టీలకు సంబంధం లేకుండా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. దాడుల సంఘటనలు వెలుగులోకి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర వహిస్తోందని చెప్పారు. సమాజంలో మార్పు రావాలని, ప్రధానంగా మనిషి వ్యక్తిత్వంలో మార్పు వస్తేనే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని అన్నారు. వివాహ వ్యవస్థలో సైతం మార్పులు అనివార్యమన్నారు. విడాకులతో జీవితాలను నాశనం చేసుకుంటున్న వారికి రాష్ట్రవ్యాప్తంగా మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తూ  అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గృహహింస చట్టం అమల్లో కొన్ని లోపాలున్నాయని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు సమర్థనీయమన్నారు. కొన్ని చట్టాల్లో లోపాలను సవరించాల్సి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మునిసిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ దొమ్మేటి వెంకట సుధాకర్‌ పాల్గొన్నారు.  
 
మరిన్ని వార్తలు