అత్తింటి సొమ్ముపై ఆశతో అఘాయిత్యం

3 May, 2017 22:29 IST|Sakshi
అత్తింటి సొమ్ముపై ఆశతో అఘాయిత్యం
పెనుమంట్ర: అత్తింటి సొమ్ముపై అతడికి తరగని ఆశ.. పెళ్లయినప్పటి నుంచి అదే ధ్యాస.. చివరకు కట్టుకున్న భార్యను కడతేర్చే వరకూ వెళ్లింది అతడి పైశాచికత్వం. విరామం లేని వేధింపులతో ఆమె రోజూ నరకయాతన అనుభవించింది. పెద్దలు, కుటుంబసభ్యులు సర్దిచెప్పినా అతడిలో మార్పు రాకపోగా రాక్షస రూపం బయటకు వచ్చింది. క్షణికావేశంలో భార్యను కొట్టి చంపేశాడు. పెనుమంట్ర మండలం జుత్తిగ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుమంట్ర మండలం జుత్తిగ గ్రామానికి చెందిన సత్తి వెంటక రామకృష్ణారెడ్డికి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం రాధేయపాలెం గ్రామానికి చెందిన విజయశ్రీ (42)తో దాదాపు 21 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి. పెద్ద కుమార్తెకు వివాహం కాగా చిన్న కుమార్తె, కుమారుడు హాస్టల్‌ ఉండి చదువుకుంటున్నారు. రామకృష్ణారెడ్డి ఉపాధి నిమిత్తం దుబాయ్‌ వెళ్లి కొన్నాళ్ల క్రితం గ్రామానికి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాడు. అయినా ఇంట్లో అన్ని అవసరాలు, ఖర్చులకు భార్య, అత్తవారింటి పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. దాదాపు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నా అత్తింటి ఆస్తి, పెట్టుబడులపై తీరని ఆశ ఉంది. ఈ నేపథ్యంలో భార్యతో తరచుగా గొడవలు పడేవాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం అత్తింటివారు, గ్రామ పెద్దల సమక్షంలో తగవు జరగ్గా సర్దిచెప్పి పంపించేశారు. అర్ధరాత్రి సమయంలో భార్యతో గొడవ పడిన వెంకట రామకృష్ణారెడ్డి కొబ్బరికాయలు వలుచుకునే పక్కరుతో ఆమె తలపై గట్టిగా కొట్టాడు. దీంతో విజయశ్రీ అక్కడికక్కడే మృతిచెందింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వీరి మధ్య గొడవ తారాస్థాయికి చేరిందని, ఆవేశంలో ఉన్న రామకృష్ణారెడ్డి విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె మృతిచెందినట్టు పెనుగొండ సీఐ సీహెచ్‌ రామారావు చెప్పారు. బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై జీజే ప్రసాద్‌ ఆయన వెంట ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 
మరిన్ని వార్తలు