ఆశల ఎర్రకూలీలు

21 Sep, 2016 23:19 IST|Sakshi
అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం
– కూలీలకు మోటార్‌ బైక్‌ల తాయిలం
–ఎర్ర చందనం నరికివేతకు స్మగ్లర్ల ఒప్పందం
–నాలుగు ట్రిప్పులకు రూ. లక్ష నగదు
– జావాదిమలయ్‌ చుట్టూ తమిళ స్మగ్లర్లు
– పట్టుబడతున్న వారిలో వీరే ఎక్కువ 
 
తిరుపతి మంగళం:
          తమిళనాడులోని తిరువణ్ణామలై, కృష్ణగిరి, జావాదిమలయ్‌ ప్రాంతాల్లోని యువతకు కొత్త కొత్త మోటార్‌ బైక్‌లంటే ఎంతో ఇష్టం. అక్షర జ్ఞానం లేకపోయినా కొత్త బైక్‌లనెక్కి జోరుగా తిరగడం వీరికి మహా సరదా. అయితే ఇక్కడుండే కుటుంబాల్లో అధిక శాతం పేద, మధ్య తరగతి కుటుంబాల వారు కావడంతో మోటార్‌ బైక్‌లు కొనుగోలు చేయడం వీరికి కష్టంగా మారింది. ఆర్థిక స్తోమత సరిగా లేని యువకులంతా మోటార్‌బైక్‌లపై ఉన్న మోజును తీర్చుకోలేక అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. సరిగ్గా ఇదే బలహీనతను పక్కాగా పసిగట్టిన తమిళ స్మగ్లర్లు వీరిని కలిసి మోటార్‌ బైక్‌లను ఎర వేస్తున్నారు. 
 సామాన్య యువతపై స్మగ్లర్లు ఆశల వల విసురుతున్నారు. వారి చిన్నపాటి కోరికలను అనుకూలంగా మార్చుకుంటున్నారు. చాకచక్యంగా ఎర్రచందనం స్మగ్లింగు ఉచ్చులోకి దించుతున్నారు. శేషాచలంలోనికి రెండు సార్లు Ðð ళ్లొస్తే ఒక బైక్, నాలుగు సార్లయితే రూ.లక్ష చొప్పున నగదు ఆశ చూపుతున్నారు, సరైన ఉపాధి పనులు లేక, కుటుంబం గడవక అవస్థ పడే ఎంతోమంది జావాదిమలయ్‌ యువకులు ముందూ వెనకా చూసుకోకుండా ఎర్ర కూలీలుగా శేషాచలంలో చొరబడుతున్నారు. ఇదే వీరి పాలిట శాపంగా మారుతోంది. టాస్క్‌ఫోర్సు పోలీసుల చేతుల్లో చిక్కి ఖైదీలుగా మారుతున్నారు. బతుకును కోల్పోతున్నారు. తమిళనాడులోని జావాదిమలయ్‌ ప్రాంతానికీ శేషాచలానికీ దగ్గర సారూప్యం ఉంది. ఈ రెండు ప్రాంతాల్లోనూ విలువైన వృక్ష సంపద ఎక్కువ. ఎర్రచందనం, శ్రీగంధం చెట్లున్న ఈ ప్రాంతాలు కొండలు, లోయలతో ఎగుడు దిగుడుగా ఉంటాయి. ఇక్కడి అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులు కూడా ఎక్కువే. ఈ తరహా అటవీ ప్రాంతంలో సామాన్య ప్రజానీకం తిరగాలంటే కష్టం. కొండలెక్కి దిగడంలో మంచి అనుభవమున్న జావాదిమలయ్‌ ప్రాంతీయులే శేషాచలంలో సులభంగా తిరగ గలుగుతారు. దీంతో స్మగ్లర్లు ఎక్కువగా జావాదిమలయ్‌ ప్రాంతానికి చెందిన కూలీలనే ఎంచుకుంటున్నారు. 2016 సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ చిత్తూరు, కడప జిల్లాల్లో  163 స్మగ్లింగ్‌ కేసులు  నమోదైతే 800 మందికి పైగా అరెస్టు చేశారు. వీరిలో 80 శాతం మంది జావాదిమలయ్‌ ప్రాంతం వారే.  
 
కేసులు తగ్గుముఖం...
రెండు నెలలుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన అటవీ చట్టం కింద టాస్క్‌ఫోర్సుకు ప్రత్యేక విచారణాధికారాలను వర్తింపజేసింది. గతంలో మాదిరిగా టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేసిన స్మగ్లర్లను అటవీ, పోలీస్‌ అధికారులకు అప్పగించాల్సిన పనిలేదు. నేరుగా వీరే విచారణ చేయొచ్చు. కోర్టుకు కూడా పెట్టవచ్చు. అంతేకాకుండా ఫారెస్టు ప్రాంతాల్లోనే కాకుండా మైదాన ప్రాంతాల్లోనూ, పట్టణాల్లోనూ టాస్క్‌ఫోర్సు పోలీసులు తనిఖీలు చేయొచ్చు. కొత్త జీవో వచ్చాకనే ఈ తరహా వెసులుబాటు టాస్క్‌ఫోర్సు పోలీసులకు లభించింది. అప్పటి నుంచి తనిఖీలను ముమ్మరం చేశారు. దీంతో గడచిన రెండు నెలలుగా స్మగ్లింగ్‌ కేసులు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. 
 
స్మగ్లింగ్‌ను పూర్తిస్థాయిలో అరికడుతాం
             అటవీశాఖలో వచ్చిన కొత్త చట్టాలు, టాస్క్‌ఫోర్సుకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలతో ఎర్రచందనం అక్రమంగా తరలిపోకుండా, ఎర్రకూలీలను శేషాచల అడవుల్లోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాం. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించి రూ.కోట్లు దండుకున్న ప్రధాన స్మగ్లర్ల ఆట కట్టించేందుకు రంగం సిద్దం చేశాం. కొత్త చట్టాలతో స్మగ్లర్లకు శిక్ష పడేలా చేస్తాం.
                                                               ఎం కాంతారావు, టాస్క్‌ఫోర్సు డీఐజీ
 
 
 
 
>
మరిన్ని వార్తలు